మా నీరు మిగిలే ఉంది | AP Government asked Krishna Board To be allowed to use water in Krishna Water | Sakshi
Sakshi News home page

మా నీరు మిగిలే ఉంది

Dec 8 2021 2:59 AM | Updated on Dec 8 2021 9:12 AM

AP Government asked Krishna Board To be allowed to use water in Krishna Water - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాలో మిగిలిన 171.163 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుతించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో 350.585 టీఎంసీలు వాడుకున్నామని పేర్కొంది. అదేవిధంగా తెలంగాణ వాటాలో 108.235 టీఎంసీలు వాడుకోగా ఇంకా 160.545 టీఎంసీలు మిగిలాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ కూడా ఇదే విధమైన ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు కృష్ణా బోర్డు నుంచి త్రిసభ్య కమిటీకి వచ్చాయి. గురువారం డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, వాటాలో మిగిలిన నీటి కేటాయింపులుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కేటాయింపుల ఆధారంగా రబీలో ఆయకట్టుకు నీటి విడుదలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి.

మూడో ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత పుష్కలం
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 2019–20, 2020–21 తరహాలోనే ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో సాగు, తాగునీటి కోసం అవసరమైన జలాలు వాడుకోవాలని, డిసెంబర్‌లో లెక్కలు తేల్చి.. వాటాలో మిగిలిన జలాలపై నిర్ణయం తీసుకుంటామని రెండు రాష్ట్రాలకు ఆదిలోనే కృష్ణా బోర్డు చెప్పింది. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో 790.528 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు లెక్కతేలింది. ఏపీ, తెలంగాణకు 66 : 34 నిష్పత్తిలో పంపిణీ చేస్తామని బోర్డు ఆదిలోనే చెప్పింది. ఈ విధంగా ఏపీకి 521.75 టీఎంసీలు, తెలంగాణకు 260.78 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఇందులో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ ఏపీ 350.585 టీఎంసీలు, తెలంగాణ 108.235 టీఎంసీలు.. మొత్తం 458.82 టీఎంసీలను వాడుకున్నాయి. 

ఇంకా 331.708 టీఎంసీల లభ్యత
కృష్ణాలో నీటి లభ్యత ఇప్పటికీ పుష్కలంగా ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన 253.311 టీఎంసీలు ఉంది. జూరాలలో 5.853, పులిచింతల ప్రాజెక్టులో 38.17 టీఎంసీలు ఉంది. తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ, తెలంగాణ కోటా కింద ఇంకా 24.474 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో మధ్య తరహా ప్రాజెక్టుల్లో 9.90 టీఎంసీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే డిసెంబర్‌ రెండో వారానికి కృష్ణా బేసిన్‌లో 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏపీ వాటా నీటిలో ఇంకా 171.163 టీఎంసీలు, తెలంగాణకు 160.545 టీఎంసీలు ఉంటాయి. ఇలా మిగిలిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని రాష్ట్రాలు కోరుతున్నాయి.

49.72 టీఎంసీల మిగులు జలాలు మళ్లింపు
శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా వరద జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్‌ చేసిన ప్రతిపాదనకు కృష్ణా బోర్డు అంగీకరించింది. వృథాగా సము ద్రంలో కలిసే నీటిని ఎవరు వాడుకున్నా నష్టం లేదని పేర్కొంది. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 17.96, పోతిరెడ్డిపాడు 21.24, హంద్రీ–నీవా 2.73, సాగర్‌ కుడి కాలువ 7.28, ఎడమ కాలువ 0.91 వెరసి 49.72 టీఎంసీల మిగులు జలాలను ఏపీ సర్కార్‌ మళ్లించింది. ఇదే విధంగా తెలంగాణ సర్కారు ఏఎమ్మార్పీ, ఎఫ్‌ఎఫ్‌సీ, కల్వకుర్తి, ఎడమ కాలువ ద్వారా 11.94 టీఎంసీలను వాడుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement