
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ జారీ అయిన జీవోకు ముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట బుధవారం అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయా లని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు.
ఈ అప్పీల్ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, ఆ కాపీ దాఖలుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.