AP CM YS Jagan Speech: ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు.. సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్‌

AP CM YS Jagan Speech At Draupadi Murmu Meet And Greet - Sakshi

సాక్షి, మంగళగిరి: సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్‌ కోరారు. ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్‌ కోరారు. 

అంతేకాదు ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్‌ పోలింగ్‌ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.  అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను ముర్ముకు పరిచయం చేశారు సీఎం జగన్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top