AP Assembly 2022: AP CM YS Jagan Speech On Creation Of Government Jobs - Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో 6,16,323 ఉద్యోగాలు కల్పించాం: సీఎం వైఎస్‌ జగన్‌

Sep 20 2022 5:01 AM | Updated on Sep 20 2022 9:01 AM

AP CM YS Jagan Speech In Assembly On Jobs - Sakshi

సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. సోమవారం శాసనసభలో ‘పారిశ్రామికాభివృద్ధి–పెట్టుబడులు–రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’ అంశంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు సీఎం జగన్‌ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. మొత్తంగా సగం ఉద్యోగాలు మనందరి ప్రభుత్వంలోనే భర్తీ చేశామన్నారు. ఇవికాక కాంట్రాక్ట్‌ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్‌ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83– 84 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే ఉన్నారని.. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు అని తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల దశాబ్దాల వారి కల నెరవేరుస్తూ 51,387 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో రికార్డు స్థాయిలో 16,880 రెగ్యులర్‌ ఉద్యోగాలు, పాఠశాల విద్యా శాఖలో 6,360 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ‘ఆప్కాస్‌ క్రియట్‌ చేసి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గొప్ప మేలు చేశాం. గతంలో ఉద్యోగం ఇచ్చేటప్పుడూ లంచాలే. మళ్లీ జీతాలిచ్చేటప్పుడు కూడా లంచాలు తీసుకునే అధ్వాన్నమైన పరిస్థితి. ఈ వ్యవస్థను మార్చేశాం.

95,212 మంది ఇవాళ ఆప్కాస్‌లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌గా పొద్దున్నే లేచి గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు. నేను చెబుతున్న 6,16,323 మంది ఉద్యోగులు మన కళ్లముందే కనిపిస్తున్నారు. ఎవరైనా జగన్‌ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదని చెబితే అవి పచ్చి అబద్ధాలు అని చెప్పడానికి ఈ ఉద్యోగాలే సాక్ష్యం’ అని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..  

స్వయం ఉపాధికి చేయూత 

  • స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్ల మీద తాము నిలబడితే తమ కుటుంబాలను పోషించుకునే స్థాయిలోకి వెళ్తారు. అందుకే.. ప్రభుత్వం వైఎస్సార్‌ వాహనమిత్ర ద్వారా 2,74,015 మంది కుటుంబాలకు సొంతంగా ఆటోలు, టాక్సీలు కొని నడుపుకుంటున్న వారికి మేలు చేస్తోంది. 
  • రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు వాళ్లంతట వాళ్లే ఇస్త్రీ బండి, సెలూన్‌ షాపు, కుట్టుమిషన్‌ పెట్టుకుని జీవిస్తున్న వారికి జగనన్న చేదోడు కింద ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఏకంగా 2,98,428 కుటుంబాలకు ప్రతి సంవత్సరం తోడుగా ఉంటూ ఆర్థిక సాయం అందిస్తోంది. 
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా 82 వేల మంది మగ్గం మీద స్వయం ఉపాధి«ని పొందుతున్న వారికి మేలు చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద 1.20 లక్షల కుటుంబాలకు ఏటా తోడుగా నిలబడుతున్నాం. అన్ని రకాలుగా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం.  
  • ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ పథకం కింద రూ.1,324 కోట్లు సపోర్టు చేసి వారి కాళ్ల మీద వారు నిలబడే కార్యక్రమం చేశాం. ప్రతి ఇంటికీ బియ్యం డోర్‌ డెలివరీ చేసే వాహనాల ద్వారా 18,520 మందికి మద్దతుగా నిలిచాం. జగనన్న తోడు కింద స్ట్రీట్‌ హాకర్స్, కూరగాయల అమ్మకం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసే 15,03,558 మందికి.. వారి జీవనోపాధికి భంగం కలగకుండా, అధిక వడ్డీల బాధ తప్పించి సున్నా వడ్డీకే, ఓడీ మాదిరిగా రుణాలు ఇస్తున్నాం. 
  • ప్రతి ఆర్బీకే పరిధిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రూపులను ఏర్పాటు చేసి, మిగిలిన రైతులకు కూడా ఉపయోపడేలా, ఆ యంత్రాల మీద వారి జీవనం గడిపేలా 34,580 మందికి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా తోడుగా నిలిచాం.   
  • వైఎస్సార్‌ చేయూత ద్వారా 24,95,714 మంది అక్కలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. బ్యాంకర్లతో టై అప్‌ చేసి, ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, అమూల్‌ లాంటి కంపెనీల ద్వారా వారి కాళ్లమీద వారు నిలబడేలా చేస్తున్నాం. వైఎస్సార్‌ కాపు నేస్తం మీద మరో 3,38,792 మంది అక్కలకు తోడుగా నిలబడుతున్నాం. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద 3,92,674 మంది అక్కలకు మంచి చేస్తున్నాం. ఇలా ఏకంగా 55,57,939 మందిని స్వయం ఉపాధి రంగంలో మనం చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. మూడేళ్లలో స్వయం ఉపాధి పథకాల కోసం రూ.19,129.05 కోట్లు వ్యయం చేశాం. అందుకని వారంతా నిలదొక్కుకున్నారు. అందుకే ఇవాళ రాష్ట్రం 11.43 శాతం గ్రోత్‌ రేట్‌తో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. 

ఉద్యోగాల కల్పన వివరాలు 
2014 నుంచి 2019 వరకు బాబు హయాంలో కల్పించిన ఉద్యోగాలు: 34,108  
2019 మే వరకు ఉన్న ఉద్యోగాలు:  3,97,128 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాలు.. 
ఎ. పర్మినెంట్‌ ఉద్యోగాలు: 2,06,638 
బి. కాంట్రాక్టు ఉద్యోగాలు: 37,908 
సి. ఔట్‌ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు: 3,71,777 
ఎ+బి+సి–మొత్తం:  6,16,323  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement