వకుళమాత ఆలయం అద్భుతం.. మహాసంప్రోక్షణ క్రతువులో సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Inaugurates Vakula Matha Temple - Sakshi

సంప్రదాయ వస్త్రధారణతో ఆలయ ప్రవేశం 

పరిమళ పుష్కరిణిలో పూజలు.. అమ్మవారి తొలి దర్శనం  

వేద పండితుల ఆశీర్వచనం.. తీర్థ, ప్రసాదాల స్వీకరణ 

ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటిన ముఖ్యమంత్రి 

ఆలయాన్ని బాగా జీర్ణోద్ధరణ చేశారని మంత్రి పెద్దిరెడ్డికి కితాబు 

ఆలయ స్థపతి, స్వర్ణకారులు, దారు శిల్పులకు సత్కారం, స్వర్ణ కంకణాల బహూకరణ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ క్రతువును వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై ఉన్న ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా నిర్వహించిన మహా సంప్రోక్షణ కైంకర్యాది కార్యక్రమంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. 900 ఏళ్ల చరిత్ర కలిగి, 350 ఏళ్ల పాటు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో జీర్ణోద్ధరణ చేశారు.

చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో జరుగుతున్న మహా సంప్రోక్షణలో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పరిమళ పుష్కరిణిలో నీటిని సీఎం తలపై చల్లుకున్నారు. కోనేరు వద్ద టీటీడీ అధికారిక వృక్షం అయిన మానుసంపంగి మొక్కను నాటారు.

అనంతరం సీఎంకు టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్య అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ గోపురం ముందు ఉన్న స్వామి వారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. మంగళ వాయిద్యాల నడుమ సీఎం ఆలయంలోకి ప్రవేశించారు. 

మరింత అభివృద్ధికి తోడ్పాటు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. శ్రీవకుళమాత అమ్మవారి తొలి దర్శన భాగ్యాన్ని అందుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గోవింద నామస్మరణ మధ్య కాసేపు గర్భాలయంలో ఉండిపోయారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి చతుర్వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సీఎంకు డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీవకుళమాత ఫొటో ఫ్రేమ్‌ను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడుతూ.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. అనంతరం విమాన గోపురాన్ని దర్శించుకున్నారు.

అమ్మవారు వెలసిన కొండపై నలుదిక్కులా కలియదిరిగారు. ఉత్తరం వైపు ఉన్న సప్తగిరుల వైపు చూస్తూ.. కలియుగ వైకుంఠనాథుడికి ముకుళిత హస్తాలతో నమస్కరించారు. దివ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. నాటి వైభవం సాక్షాత్కరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసిన స్థపతి సూరిబాబు, దారుశిల్పి మహేష్, స్వర్ణకారులు శ్రీనివాస్‌లను సీఎం సత్కరించారు. వారికి స్వర్ణ కంకణాలను బహూకరించారు. అమ్మవారి విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్, ఆలయంలో మెటల్‌ వర్క్‌ను అద్భుతంగా చేసిన సారథిలను దుశ్శాలువతో సత్కరించారు.

తమిళ శాసనం అద్భుతమే
ఆలయ చారిత్రక నేపథ్యాన్ని తెలియజేసే క్రీ.శ. 1198 నాటి తమిళ శాసనం బయటపడటం అద్భుతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఆలయం ముందున్న శాసనాన్ని మంత్రి పెద్దిరెడ్డి సీఎంకు చూపించి, చరిత్రను వివరించారు. పురావస్తు శాఖ ద్వారా తర్జుమా చేసిన వివరాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. శాసనాన్ని జాగ్రత్తగా కాపాడాలని టీటీడీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మలికార్జునరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, వెంకటేశ్‌గౌడ, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ప్రశాంతిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top