కాలుష్య బడ‘బాన’లం | AP among top 5 states using boilers heavily | Sakshi
Sakshi News home page

కాలుష్య బడ‘బాన’లం

Jun 9 2025 2:45 AM | Updated on Jun 9 2025 2:45 AM

AP among top 5 states using boilers heavily

బాయిలర్ల వినియోగం పర్యావరణానికి పెనుముప్పు

దేశ వ్యాప్తంగా విడుదలయ్యే కాలుష్యంలో 7 శాతం వీటి నుంచే.. 

ఏటా 182 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల 

భారీగా బాయిలర్లు వినియోగిస్తున్న టాప్‌–5 రాష్ట్రాల్లో ఏపీ 

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయని పర్యావరణం దెబ్బ­తింటుందని  ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. 2030 నాటికి  కర్బన ఉద్గారాలను 45 శాతం తగ్గించాలని, 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని ప్రణా­ళికలు రచిస్తున్నా­యి. ప్యారిస్‌లో అన్ని దేశాలూ కలిసి సమావేశమై ఈ విషయంపై తీవ్రంగా చర్చించి ఒప్పందం కూడా చేసుకున్నాయి. అయినా మార్పు సాధించింది మాత్రం నామ మాత్ర­మే. 

ప్రధానంగా  పరిశ్రమలు, వాటిలోని బాయిలర్లు (కాగు బాన) విపరీతంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడింగ్‌(డీపీఐటీ) తాజా అధ్యయనం తేల్చింది.  రసాయనాలు, దుస్తులు తయారీ, ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌ వంటి పరిశ్రమల్లోని బాయిలర్లు మరింత ఎక్కువగా కాలుష్యం ఉత్పత్తి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

పాతికేళ్ల నాటి బాయిలర్లే అధికం 
దేశ వ్యాప్తంగా 42,500 బాయిలర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇవన్నీ కలిసి 1.26 బిలియన్‌ టన్నుల ఆవిరిని విడుదల చేస్తున్నాయి. పైగా ఇప్పుడున్నవన్నీ 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల పాత బాయిలర్లు కావడంతో సల్ఫర్‌ డయాక్సైడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విడుదలయ్యే గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాల్లో 7 శాతం బాయిలర్ల నుంచే వస్తుందని అంచనా. 

అంటే ఏటా 182 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను బాయిలర్లు విడుదల చేస్తున్నాయన్నమాట. ఇది రవాణా రంగంలోని అన్ని వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కంటే ఎక్కువ. ఇతర పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంలో నాలుగో వంతు కంటే అధికం. 40 శాతం బాయిలర్లు బొగ్గు, గ్యాస్, ఆయిల్‌ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.  

ఏపీలో నియంత్రణ చర్యలు శూన్యం
ప్రమాదకర బాయిలర్లను వాడుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. బాయిలర్లు అధిక స్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లను ఉత్పత్తి చేయకుండా అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదని అధ్యయనం తెలిపింది. 

ఈ పరిశ్రమల్లో ‘గ్రీన్‌ బాయిలర్‌ మిషన్‌’ను అమలు చేయాలని సూచించింది. ఆ దిశగా ఉత్తరప్రదేశ్‌ ముందడుగు వేసింది. తాజాగా బాయిలర్స్‌ యాక్ట్‌ 2025ను ఆ రాష్ట్రం అమలులోకి తీసుకువచ్చింది. అలాగే శిలాజ ఇంధనాలకు బదులు వరి గడ్డిని బాయిలర్లు మండించడానికి వాడే పరిశ్రమలకు మూలధన రాయితీలను పంజాబ్‌ రాష్ట్రం ప్రకటించింది. టాప్‌ 5లో ఉన్న మన రాష్ట్రం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement