రాజధానిలోని తుళ్లూరులో చెరువు భూమిని ఆక్రమించి టీడీపీ నేతలు నిర్మించిన ప్రైవేటు కాలేజీ
అమరావతిలో మరో అక్రమాల భూ బాగోతం
తుళ్లూరులో చెరువు భూమి 60 సెంట్లు ఆక్రమించి ప్రైవేటు కాలేజీని నిర్మించిన టీడీపీ నేతలు
ఎన్–14 రోడ్డు కోసం ఆ భూమిని సమీకరణ కింద తీసుకున్న సర్కారు
బదులుగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ గద్దె మంగయ్యకు 2,909 గజాల నివాస, 500 గజాల వాణిజ్య ప్లాటు కేటాయింపు
అది చాలదన్నట్లు కాలేజీ భవనాలకు రూ.1.40 కోట్ల పరిహారం చెల్లింపు
ఇంకా సరిపోదన్నట్లు కాలేజీ భవనాలకు సమీపంలో తమకు 3.10 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ సరి్టఫికెట్ సృష్టించిన వైనం
దానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలని సీఆర్‌డీఏకు దరఖాస్తు
ఓ కేంద్ర మంత్రి చక్రం తిప్పడంతో శాశ్వత సచివాలయం సమీపంలో విలువైన 3 ఎకరాలు కేటాయింపు
ఈ భూ కుంభకోణంపై స్థానిక టీడీపీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్న వైనం
సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించి దోచి పెట్టడంపై రైతులు, న్యాయ నిపుణుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాజధానిని బాబు సర్కారు భూ కుంభకోణాల నిలయంగా మార్చిందనేందుకు మరో తార్కాణమిది! చెరువును ఆక్రమించి కట్టిన భవనాలకు పరిహారంతోపాటు విలువైన ప్లాట్లను బహుమానంగా ఇవ్వడం బరితెగింపునకు పరాకాష్టగా మారింది.
కేంద్ర మంత్రి అండదండలతో...
రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు చెరువును ఆక్రమించి నిర్మించుకున్న ప్రైవేట్ కాలేజీకి చెందిన రెండు భవనాలను ఎన్–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించాల్సి రావడంతో సీఆర్‌డీఏ అధికారులు వాటిని భూ సమీకరణ కింద తీసుకున్నారు. ఆ కాలేజీని నిర్వహిస్తున్న తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ గద్దె మంగయ్యకు రైతులకు ఇస్తున్న దానికంటే అధిక పరిమాణంతో కూడిన వాణిజ్య, నివాస ప్లాట్లు కేటాయించింది. కాలేజీ భవనాలకు సీఆర్‌డీఏ రూ.1.40 కోట్ల మేర పరిహారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతటితో ఆగకుండా.. చెరువును ఆక్రమించి కట్టిన ఆ ప్రైవేట్ కాలేజీ భవనాలకు సమీపంలోనే యాజమాన్యానికి 3.10 ఎకరాల భూమి ఉందంటూ తహసీల్దార్ జారీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఆ నకిలీ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి రాజధాని ప్రధాన ప్రాంతంలోని రాయపూడి వద్ద సర్వే నెంబరు 204, 205లో మూడు ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించడంపై తుళ్లూరు మండలం టీడీపీలోని ఓ వర్గం నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ముసుగులోని టీడీపీ నేతలకు ఓ కేంద్ర మంత్రి దన్నుగా నిలిచి.. భూమి కేటాయించేలా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. రాజధానిలో టీడీపీ నేతలు ఏ స్థాయిలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారో చెప్పేందుకు ఇది మచ్చు తునక అని పరిశీలకులు పేర్కొంటున్నారు. చెరువులు.. కుంటలు.. వాగులు, వంకలు లాంటి జలవనరులను ఆక్రమించడం నేరమని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ తీర్పులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు బరితెగించారని న్యాయనిపుణులు మండిపడుతున్నారు.


చెరువును ఆక్రమించి కట్టిన రెండు కాలేజీ భవనాలకు సమీపంలో 3.10 ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం అందుబాటులో ఉన్నదని తుళ్లూరు తహసీల్దార్ టీడీపీ నేతలు సష్టించిన నకిలీ సర్టిఫికెట్

తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గద్దె మంగయ్యకు ఇచ్చిన 2070 గజాల ప్లాట్ వివరాలు
60 సెంట్లు ఆక్రమణ.. రెండుసార్లు పరిహారం
» తుళ్లూరులో సర్వే నంబరు 78లో చెరువు 23.80 ఎకరాలలో విస్తరించి ఉందని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఐదు దశాబ్దాల క్రితం అక్కడ కేవీఆర్ జెడ్పీ హైసూ్కల్ ఏర్పాటైంది. 1992లో టీడీపీ నేతలు గద్దె మంగయ్య, జొన్నలగడ్డ శంకరరావు, భద్రయ్య ఆ స్కూల్లో రెండు షెడ్లు లీజుకు తీసుకుని తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఎస్‌ఆర్‌వీఎస్‌అండ్‌ఎన్‌ఎస్‌ఆర్ కాలేజీ ప్రారంభించారు. కొన్నా ళ్ల తర్వాత జెడ్పీ హైస్కూల్ వెనుక ఉన్న చెరువు భూమి 60 సెంట్లు ఆక్రమించి.. షెడ్లతోపాటు కొన్ని భవనాలు నిర్మించి ప్రైవేట్ కాలేజీ నడుపుతున్నారు.
» 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రకటన తర్వాత ఎన్–14 రోడ్డు ఆ కాలేజీ మధ్య నుంచి వెళ్తుండటంతో తొలగించాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. చెరువు భూమిని ఆక్రమించి కాలేజీని నిర్మించారని తెలిసినా ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఆ భూమిని భూ సమీకరణ కింద తీసుకున్నారు.
» భూ సమీకరణ కింద రైతుల నుంచి మెట్ట భూమి ఎకరం తీసుకుంటే ఏటా కౌలుతోపాటు వెయ్యి గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి ఎకరానికి కౌలుతోపాటు వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తారు. అయితే ఆక్రమించిన 60 సెంట్ల చెరువు భూమికి సాధారణ రైతులకు ఇచ్చే పరిమాణం కంటే అధిక విస్తీర్ణంతో కూడిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఆ సొసైటీ ప్రెసిడెంట్ గద్దె మంగయ్యకు కేటాయించారు. గద్దె మంగయ్యకు 2,070 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస, 500 గజాల వాణిజ్య ప్లాటును కేటాయించారు. అంతేకాకుండా ఆ కాలేజీ భవనాలకుగా ను రూ.1.40 కోట్ల మేర సీఆర్‌డీఏ పరిహారం కూడా చెల్లించిందని రాజధాని రైతులు చెబుతున్నారు.
నకిలీ సర్టిఫికెట్ సృష్టించి.. అప్పనంగా 3 ఎకరాలు!
ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్–14 రోడ్డుతో కోల్పో తున్న కాలేజీ భూమికి పరిహారంగా భూమిని కాజేసేందుకు తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ పావులు కదపడం మరొక ఎత్తు. ప్రైవేటు కాలేజీ కోసం చెరువును ఆక్రమించి నిర్మించిన రెండు భవనాలను తుళ్లూరు తహసీల్దార్ తనిఖీ చేసినట్లు.. 1996–97 విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు ఆ భవనాలు సిద్ధంగా ఉన్నట్లు.. భవిష్యత్ అవసరాల కోసం సమీపంలోనే 3.10 ఎకరాల భూమీ అందుబాటులో ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
సర్టిఫికెట్‌లో ఆ భవనాలను తనిఖీ చేసిన తేదీగానీ.. తహసీల్దార్ సంతకంగానీ లేదు. ఆ నకిలీ సర్టిఫికెట్‌ను చూపుతూ.. ఎన్–14 రోడ్డు నిర్మాణం వల్ల కాలేజీ భవనాలతోపాటు తాము 3.10 ఎకరాల భూమి కోల్పోయామని, ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలని తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ముసుగులో టీడీపీ నేతలు సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఓ కేంద్ర మంత్రి వారికి దన్నుగా నిలిచి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.
తలొగ్గిన అధికారులు 3 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపారు. వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సచివాలయం శాశ్వత భవనాలు నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)కి అత్యంత సమీపంలో ‘తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ’కి 3 ఎకరాల భూమిని కేటాయిస్తూ మార్చి 16న చంద్ర బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


