
కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాజెక్టు పరిధిలో తమ మొబైల్ ఫోన్లను అప్పగిస్తున్న అంగన్‌వాడీలు
నత్తనడకన సెల్‌ఫోన్ల వేగం.. పైగా యాప్‌ల భారం
దీంతో వాటిని సీడీపీఓలకు అప్పగించేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు
ఎఫ్‌ఆర్‌ఎస్, ఇతర అప్‌డేట్‌లు చేసేదిలేదని స్పష్టి కరణ
నేటి నుంచి మొబైల్ ఫోన్లు పూర్తిగా బంద్
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిరసన
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు సోమవారం నుంచి ప్రభుత్వంపై వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక యాప్‌లో డేటా అప్‌డేట్ చేసే భారాన్ని పెంచడంతో మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోక నానా అవస్థలు పడుతున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శికి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నిరసన చేపట్టామన్నారు.
‘యాప్‌ల భారం తగ్గించండి.. ఈ ఫోన్లు మాకొద్దు’ అంటూ తమ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీఓ)లకు వాటిని అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం తమ వద్ద మొబైల్ ఫోన్లను చక్కగా ప్యాక్‌చేసి సీడీపీఓలకు అందించారు. కొన్నిచోట్ల వాటిని తీసుకోగా, మరికొందరు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, తమ మొబైల్ ఫోన్లను సీడీపీఓలు తీసుకున్నా తీసుకోకపోయినా మంగళవారం నుంచి డేటా అప్‌డేట్ చేసేదిలేదని అంగన్‌వాడీ వర్కర్లు తెగేసి చెబుతున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అవస్థలు
ఇక ప్రతి అంగనవాడీ కేంద్రం పరిధిలోను లబ్ధిదారులైన గర్భిణి, మూడేళ్లలోపు చిన్నారుల తల్లికి సంబంధించి నెలలో రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నేషన్) చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పోషణ్ ట్రాకర్’ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘బాల సంజీవిని’ యాప్‌లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఎఫ్‌ఆర్‌ఎస్, ఓటీపీ, ఈకేవైసీ, ఆధార్, మొబైల్ అప్‌డేట్ వంటి వాటిని రెండు యాప్‌ల్లోను నెలనెలా రెండేసిసార్లు చేయాలి.
ఇందుకు తమ మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోవడం లేదని, ఒక్కసారి పూర్తిచేయాలంటేనే 20 రోజులు పడుతోందని అంగన్‌వాడీ వర్కర్లు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు యాప్‌లను ఒక యాప్‌గా మార్చాలని.. 2జీబీ ర్యామ్ మొబైల్ ఫోన్ల స్థానంలో వేగంగా పనిచేసే వాటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో.. మొబైల్ ఫోన్లు ఇచ్చేసే నిరసన చేపట్టినట్లు అంగన్‌వాడీ వర్కర్లు చెబుతున్నారు.
నేటి నుంచి మొబైల్ ఫోన్లు బంద్
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం పనిభారం పెంచుతోంది. సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదు. యాప్‌ల భారం తగ్గించాలని అంగన్‌వాడీలకు చెందిన మూడు యూనియన్ల రాష్ట్ర నాయకుల బృందం కూటమి ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. అయినా, ఫలితం లేకపోవడంతో మొబైల్ ఫోన్ అప్పగింత ఆందోళన చేపట్టాం.
అలాగే, మంగళవారం నుంచి మొబైల్ ఫోన్లను బంద్‌చేసి యాప్‌లలో ఎఫ్‌ఆర్‌ఎస్ చేయబోమని ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పాం. ఇక గౌరవ వేతనం బకాయిలు ఐదునెలలుగా పేరుకుపోయాయి. బిల్లులు, వేతనాలు నెలనెలా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సోనా మసూరి బియ్యం ఇచ్చి మెనూ ఛార్జీలు పెంచాలి. అంగన్‌వాడీలకు ఇతర యాప్‌లు, పథకాలకు సంబంధించిన భారాలను అప్పగించకూడదు. – జె.లలితమ్మ, ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్స్ అసోసియేషన్