
ఆరురోజులు దాటినా ఖరారుకాని వైనం
తక్కువ కొటేషన్ కాదని.. ఎక్కువ కోట్ చేసిన డీసీఎంఎస్‌కే ఇవ్వాలంటూ ఒత్తిళ్లు
పాలుపోని పరిస్థితిలో అధికారులు
ప్రభుత్వతీరుపై పెదవి విరుస్తున్న టెండరుపోటీదారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లాలో గురుకుల విద్యాలయాలకు సరుకులు సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో దిగజారుడు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో 11 జ్యోతిరావు పూలే గురుకులాలు, రెండు ఏపీ రెసిడెన్షియల్ , 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు గాను కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ వంటి సరుకులను సరఫరా చేసేందుకు గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 40 మంది టెండర్లు దాఖలు చేశారు.కానీ ఆ టెండర్ల వ్యవహారంలో అధికార కూటమి నేత జోక్యం టెండర్ ప్రక్రియకు గ్రహణం పట్టినట్లయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే
జూన్ 28న జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తొలుత శ్రీకాకుళం డివిజన్‌లో ఐదు గురుకులాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుండగా డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ రంగంలోకి దిగారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన గురుకులాల టెండర్లు డీసీఎంఎస్‌కే కావాలని, తాను డీసీఎంఎస్ అధ్యక్షునిగా ఉన్నందున ఇంకెవరికి ఇవ్వరాదని అధికారులకు తేల్చిచెప్పారు. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో జిల్లాకు చెందిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి టెండర్ నిలిపి వేయించినట్లు తెలుస్తోంది.
కొటేషన్‌లోనూ ఎక్కువే..
వాస్తవానికి ప్రైవేటు టెండరుదారులు ఓ సరుకుకు రూ.330 కోట్ చేయగా, అదే సరుకుకు డీసీఎంఎస్ ద్వారా రూ.805 కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ఎక్కువ కోట్ చేసిన వారికి టెండరు ఖరారు చేయకూడదు. ఆ లెక్కన డీసీఎంఎస్ అనర్హత సాధించినట్లే. అయితే ఓవైపు నిబంధనలు, మరోవైపు మంత్రి స్థాయి నుంచి ఒత్తిళ్లు వెరసి ఏం చేయాలో తోచక అధికారులు టెండర్‌ను వాయిదా వేశారు. దీంతో తక్కువ ధరకు కోట్ చేసిన టెండరుదారులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.