‘నీట్‌’లో ఏపీ విద్యార్థులు 61.77% ఉత్తీర్ణత

Andhra Pradesh Students Passed 61.77 percent in NEET UG-2022 - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. నీట్‌ యూజీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. ఏపీ నుంచి 61.77 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 65,305 మంది పరీక్షకు హాజరు కాగా, 40,344 మంది అర్హత సాధించారు.

రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని తనిష్క 715 స్కోర్‌ సాధించి, 99.99 పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ఢిల్లీకి చెందిన వి. ఆశిష్‌బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేష్‌ నాగభూషణ్‌ మూడో ర్యాంకు, రూచ పవాషే నాలుగో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన ఇ.సిద్దార్థ్‌ రావు ఐదో ర్యాంక్‌ సాధించారు. ఏపీకి చెందిన ఎం. దుర్గ సాయి కీర్తి తేజ 12వ ర్యాంక్, ఎన్‌.వెంకటసాయి వైష్ణవి 15వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. జి.హర్షవర్ధన్‌ నాయుడు 25వ ర్యాంకు సాధించాడు.

చదవండి: (‘నీట్‌–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల)

ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ ఇలా కోటాలు కలిపి 5,060 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (ఈడబ్ల్యూఎస్‌ అదనపు సీట్లు కలిపి) ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ (కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి.

అత్యల్పంగా ఒంగోలు రిమ్స్‌లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో ఆల్‌ ఇండియా కోటా 325 సీట్లు, రాష్ట్ర కోటాలో 1,890 సీట్లు భర్తీ చేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top