సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ

Andhra Pradesh Is Key In Solar Power Generation In The Country - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. 2015లో రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 279 మెగావాట్లు కాగా, ఇప్పుడది 4,390.48 మెగావాట్లకు చేరింది. 2020లో రాష్ట్రంలో స్థాపిత సౌర విద్యుత్‌ సామర్థ్యం 3,744 మెగా వాట్లుగా ఉంది. 2021లో దేశంలో 10 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని స్థాపిస్తే.. అందులో 50 శాతం ఏపీ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్టు అధ్యయనంలో వెల్లడైంది.
చదవండి: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌పై టీడీపీ విషం.. ఏపీకి పెట్టుబడులు అడ్డుకునేందుకు కుట్ర

సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్‌లు 2021లో 138 శాతం పెరగడంతో 2021–22 చివరి నాటికి 4,148.91 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుత 2022–23 ఆరి్థక సంవత్సరంలో ఇప్పటికే  సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 241.57 మెగా వాట్లు అదనంగా పెరిగింది. ఒక్కో మెగావాట్‌ నుంచి ఏటా సగటున దాదాపు 15 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శం  
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో (జనవరి–జూన్‌) 47.64 బిలియన్‌ యూనిట్ల సౌర విద్యుదుత్పత్తి జరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మొదటి త్రైమాసికం) 22.22 బిలియన్‌ యూనిట్లుండగా, రెండో త్రైమాసికం(ఏప్రిల్, మే, జూన్‌)లో 25.41 బిలియన్‌ యూనిట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అయ్యింది. అంటే తొలి త్రైమాసికం కంటే 14 శాతం పెరుగుదల రెండో త్రైమాసికంలో వచ్చింది.

అదే 2021లో ఇదే సమయానికి జరిగిన ఉత్పత్తితో పోల్చితే 40 శాతం పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2030 నాటికి థర్మల్‌ విద్యుత్‌ను 32 శాతానికి తగ్గించాలని, కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నాకు తేవాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీని కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చూపుతోంది. 2024 నాటికి అందరూ ఏపీనే అనుసరించాలని, వ్యవసాయానికి సౌర విద్యుత్‌నే వాడాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజాగా సూచించింది.

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పర్యావరణ హితంగా విద్యుదుత్పత్తి సాధించగల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 రివర్స్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను స్థాపిస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని నిర్ణయించింది. దాని కోసం ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)తో 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కోసం ఒప్పందం చేసుకుంది. 
 – విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top