నాసిరకం సెమన్‌తో చిక్కులు.. అందుకే | Andhra Pradesh To Implement AP Bovine Breeding Act 21 | Sakshi
Sakshi News home page

Bovine Breeding Act 21: నాసిరకం సెమన్‌తో చిక్కులు.. అందుకే

Jul 26 2021 9:13 PM | Updated on Jul 26 2021 9:24 PM

Andhra Pradesh To Implement AP Bovine Breeding Act 21 - Sakshi

సాక్షి, అమరావతి:  పశువుల పునరుత్పత్తి విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతోంది. ఎవరుపడితే వారు, ఎలాబడితే అలా పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, ఎదకొచ్చిన పశువులను ఇష్టమొచ్చిన రీతిలో ఎద కట్టించడం, అనైతిక పశు సంపర్కం చేయించటం ఇకపై చెల్లదు. మేలు జాతి పశువుల పునరుత్పత్తి, అధిక పాల దిగుబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పశు పునరుత్పత్తి చట్టం (ఏపీ బోవైన్‌ బ్రీడింగ్‌ యాక్ట్‌–21)ను తీసుకురాబోతోంది. తద్వారా నాసిరకం పశు వీర్యోత్పత్తి, అనైతిక పద్ధతుల్లో పశు సంపర్కానికి పాల్పడే వారికి అడ్డుకట్ట వేయడమే కాకుండా దేశీయ మేలు జాతి పశు సంతతిని భవిష్యత్‌ తరాలకు అందించే లక్ష్యంతో కొత్త చట్టం అమల్లోకి రానుంది. 

నాసిరకం సెమన్‌తో చిక్కులు 
కొంతమంది స్వార్ధపరులు ఎక్కడపడితే అక్కడ నాసిరకం పశువుల నుంచి వీర్యోత్పత్తి  చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కొక్క వీర్య నాళికను రూ.40కి సరఫరా చేస్తుంటే.. ప్రైవేటు వ్యక్తులు నాసిరకం వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఒక్కో నాళికను రూ.10, రూ.15కే సరఫరా చేస్తున్నారు. మేలు జాతి పశు వీర్యమని రైతుల్ని నమ్మబలికి ఎదకొచ్చిన పశువులకు వాటితో కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. దీనివల్ల్ల మేలు జాతి పశువులు అంతరించిపోవడంతోపాటు పాల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాసిరకం వీర్యోత్పత్తి, అమ్మకాలు, పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు సరైన చట్టాలు లేకపోవడంతో వారిని నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయి. 

హైబ్రీడ్‌ రకాలతో రోగాలు 
క్షీర విప్లవంలో భాగంగా అధిక పాల ఉత్పత్తే లక్ష్యంగా చలి దేశాలైన అమెరికా, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న పశువుల వీర్యంతో దేశీయ పశువుల పునరుత్పత్తి చేసేవారు. హైబ్రీడ్‌ జాతుల వీర్యంతో పశువుల్ని చూడి కట్టించటం వల్ల పాల ఉత్పత్తి పెరిగింది. కానీ.. పుట్టే పశువులు గతంలో ఎన్నడూ చూడని వ్యాధుల బారిన పడటంతోపాటు అనేక దుష్పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. 

ఇలాంటి వాటికి ఇక చెక్‌ 
ఎవరుబడితే వారు నాసిరకం వీర్యాన్ని సరఫరా చేయడం, హైబ్రీడ్‌ రకాలతో చూడి కట్టించడం వంటి పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఆదేశాల మేరకు  ఏపీ బోవైన్‌ బ్రీడింగ్‌ యాక్ట్‌–21ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలున్నాయి. ఈ యాక్ట్‌ ప్రకారం ఇక నుంచి ఏ జాతి పశువుల వీర్యాన్ని ఆ జాతి పశువులకే వాడాలి. జాతి గేదెలను అప్‌గ్రేడ్‌ చేయాలంటే ముర్రా జాతి పశు వీర్యాన్ని మాత్రమే వాడాలి. సంకర జాతి పశువులను గిర్, షాహివాల్, కాంక్రీజ్‌ వంటి జాతి పశువులతోనే సంకర పర్చాలి. ఇష్టమొచ్చిన రీతిలో నాసిరకం పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, అమ్మడం, చూడి కట్టించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే వారిపై ఈ చట్టం క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.  

నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట  
అంతరించిపోతున్న మేలు జాతి పశువులను పరిరక్షించుకోవడంతో పాటు నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట వేయడం, పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బోవైన్‌ బ్రీడింగ్‌ యాక్ట్‌–21ను తీసుకొస్తోంది. ఈ యాక్ట్‌ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అధిక పాల దిగుబడులనిచ్చే పశువుల పునరుత్పత్తికి బాటలు వేస్తుంది. 
– దామోదర్‌నాయుడు, సీఈవో, ఏపీ లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement