
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ధరలను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు ఇచ్చిన హైకోర్టు ఇక్కడ కీలక మెలిక పెట్టింది. లైసెన్స్ జారీచేసే అధికారి అయిన జాయింట్ కలెక్టర్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి, ఆయన్ని సంప్రదించిన తరువాతే టికెట్ రేట్లను ఖరారు చేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది.
అంతేగాక మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీచేసిన జీవో 35ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీవో 35 జారీకి ముందున్న విధంగానే టికెట్ల ధరలను నిర్ణయించుకోవచ్చని మాత్ర మే యాజమాన్యాలకు చెప్పింది. మంగళవారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ బుధవారం సాయంత్రం అందుబాటులోకి రావడంతో కోర్టు ఏం చెప్పిందన్న దానిపై స్పష్టత వచ్చింది.