
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్ రూపంలో ప్రభుత్వం మాత్రమే విక్రయించడం గుత్తాధిపత్యమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. థియేటర్ యాజమాన్యాలు కూడా వారి సొంత ఆన్‌లైన్ వ్యవస్థల ద్వారా టికెట్ల విక్రయానికి అనుమతించడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది.
ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకో వాలని, లేనిపక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.