‘గట్టు’ మేలు తలపెట్టి..

Andhra Pradesh GOVT Srisailam Dam Right Canal Repair Works - Sakshi

శ్రీశైలం డ్యాం కుడిగట్టు బలోపేతానికి ప్రభుత్వ చర్యలు                              

రూ.45 కోట్లతో అంచనాలు  

పట్టించుకోని గత పాలకులు 

కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టు..తెలుగు రాష్ట్రాల  జీవనాడి. ఒక వైపు విద్యుత్, మరో వైపు లక్షలాది ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ కీలకపాత్ర           పోషిస్తోంది.అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుకుడిగట్టు 2009లో వరదలు రావడంతో దెబ్బతినింది. దీన్ని బలోపేతం  చేయాలని ఎంతో మంది నిపుణులు సలహాలు, సూచనలు చేసినా గత పాలకులు పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. సాంకేతిక నిపుణులతో తనిఖీలు చేయించి.. వారి       సూచనల మేరకు కుడిగట్టును బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇంజినీర్లు..   రూ.45 కోట్లతో అంచనాలు తయారు చేసి ఇటీవలే    ప్రభుత్వానికి పంపించారు. 

నిపుణుల నివేదికలను పట్టించుకోని గత ప్రభుత్వాలు.. 
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 305     టీఎంసీలు. ప్రాజెక్టులోకి పూడిక చేరడంతో ప్రస్తుతం 215 టీఎంసీలకు సామర్థ్యం తగ్గింది. అయితే ప్రాజెక్టుకు 2009 అక్టోబరు 2న అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల    వరద నీరు వచ్చి చేరింది. అలాగే గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. 2009 అక్టోబరు 2 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి నీటిని     దిగువకు విడుదల చేశారు. అప్పట్లో వరద నీటి తాకిడికి కొండ చరియలు విరిగిపడి..కుడిగట్టు స్వల్పంగా       దెబ్బతినింది. ప్రాజెక్టు క్రస్టుగేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసే చోట ఏర్పడిన ఫ్లంజ్‌ ఫూల్‌ గుంత లోతు పెరిగింది. వరదల అనంతరం ప్రాజెక్టు పునాదుల 

గట్టితనంపై నిపుణుల చేత తనిఖీలు చేయించారు. అయితే పునాదులు ఏ మాత్రం దెబ్బతినలేదని, భవిష్యత్తులో వచ్చే భారీ వరదలకు సైతం తట్టుకునేవిధంగా కుడిగట్టును బలోపేతం చేయాలని  జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ నిపుణులు అప్పటి ప్రభుత్వానికి నివేదికలు అందజేసినా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది మార్చిలో ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  పరిస్థితి గమనించి..       అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపమని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు రూ.45 కోట్లతో ఇటీవల అంచనాలు పంపించారు. ఇదిలా ఉండగా.. సేఫ్టీ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే శ్రీశైలం డ్యాంలో అత్యవసరమైన పనులను చేయించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు సైతం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌      ఇచ్చినట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

అంచనాలు పంపించాం 
శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు..2009 వరదల సమయంలో కొంత దెబ్బతిన్న విషయం వాస్తవమే. మంత్రి పర్యటన సందర్భంగా వివరించాం. మంత్రి సూచనల మేరకు రూ.45 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం.  – ఆర్‌.మురళీనాథ్‌రెడ్డి, సీఈ, జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top