Andhra Pradesh: చేయూతతో రాణింపు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: చేయూతతో రాణింపు

Published Thu, Mar 9 2023 4:09 AM

Andhra Pradesh Govt Helping To Womens with YSR Cheyutha - Sakshi

శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురానికి చెందిన కె.సుగుణ కుమారి కుటుంబం మూడేళ్ల క్రితం దాకా ఇడ్లీలు విక్రయించి పొట్ట పోసుకుంది. కరోనాలో ఉపాధి పూర్తిగా కోల్పోయిన సమయంలో వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రభుత్వం ఆదుకుంది. మొదటి దఫా రూ.18,750 ఆర్థిక సాయంతోపాటు మరో రూ.50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించడంతో కిరాణా, ఫ్యాన్సీ షాపు ఏర్పాటు చేసుకుంది. తర్వాత మరో రెండు విడతల్లో చేయూత ద్వారా రూ.37,500 లబ్ధి చేకూరడంతో వ్యాపారాన్ని విస్తరించి షాపుపై ఆదాయంతో నిశ్చింతగా జీవిస్తోంది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గోకుల బృందావనం గ్రామానికి చెందిన ఏ.రమాదేవి కుటుంబం రెండేళ్ల క్రితం వరకు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించింది. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున వరుసగా మూడేళ్లు రూ.56,250 మేర అందించడంతో ఆ కుటుంబం కొత్తగా వ్యాపారం ప్రారంభించుకునేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 వేలు బ్యాంకు రుణం కూడా ఇప్పించింది. దీంతో రమాదేవి కుటుంబం గ్రామంలోనే కిరాణా సరుకుల దుకాణం ప్రారంభించి తొలిసారి వ్యాపారం బాట పట్టింది. 

గతంలో పొదుపు సంఘాలకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలకు మించి బ్యాంకు రుణాలు అందని పరిస్థితి. ఇప్పుడు పొదుపు మహిళలు వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకం ద్వారా సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లిస్తుండడంతో విరివిగా రుణాలందుతున్నాయి. తమ సంఘానికి ఏకంగా రూ.20 లక్షల రుణం రావడంతో తన వాటా డబ్బులతో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లకు చెందిన బండి రమణ ఊళ్లో జిరాక్స్‌ షాపు ఏర్పాటు చేసుకుంది. బధిరురాలైన రమణకు మాట సరిగా రాదు. మూడేళ్ల క్రితం వరకు ఇళ్లలో బట్టలు ఉతుకుతూ జీవించిన రమణ సొంతంగా షాపు ప్రారంభించి సగర్వంగా ఉపాధి పొందుతున్నట్లు ‘రాధా స్వయం సహాయక సంఘం’ గ్రూపు లీడర్‌ రజని ‘సాక్షి’కి తెలిపింది.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో నిజమైన సాధికారిత దిశగా సాగుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గత మూడేళ్లలో 8,65,918 నిరుపేద కుటుంబాలు కొత్తగా వ్యాపారాల బాట పట్టాయి. ఇప్పటిదాకా గ్రామాల్లో కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు, చేతి వృత్తులతో తగినంత ఆదాయం లేక సతమతమవుతున్న కుటుంబాలు ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకుంటున్నాయి.

వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించడం, వ్యాపారాల్లో తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూస్థాన్‌ యూనీ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబల్, ఐటీసీ, రిలయెన్స్‌ లాంటి ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటి సహకారంతో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన పేదింటి మహిళలు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా లాభదాయకంగా నడిపిస్తున్నారు. పొదుపు సంఘాల సభ్యులైన పేదింటి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 21 మండల కేంద్రాల్లో  సూపర్‌ మార్కెట్లను నెలకొల్పి వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు.  

నేరుగా రూ.32,470.33 కోట్లు లబ్ధి..
గత అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం మొత్తాన్ని ప్రభుత్వం తొలగిస్తోంది. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల అప్పుల భారాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తోంది. మొత్తం రూ.25,517 కోట్ల రుణంలో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,578.28 కోట్లను వారికి నేరుగా ప్రభుత్వం అందజేసింది. దీనికి తోడు గత మూడున్నరేళ్లలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీ భారం రూ.3,615.29 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది.
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా సాయం పొంది మహిళలు ఏర్పాటు చేసుకున్న షాపులు 

మరోవైపు 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఈబీసీ నేస్తం పథకం ద్వారా ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చింది. కాపు సామాజిక వర్గం మహిళలకు వేరుగా కాపు నేస్తం పేరుతో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది.

మొత్తం 34.19 లక్షల మంది మహిళలకు ఈ మూడు పథకాల ద్వారా మరో రూ.16,276.76 కోట్ల లబ్ధి చేకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 34 సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా కేవలం ఈ ఐదు పథకాల ద్వారానే మహిళలకు నేరుగా రూ.32,470.33 కోట్ల మేర ప్రయోజనాన్ని అందించింది. 


అప్పుల ఊబి నుంచి ఆదర్శంగా..
ప్రత్యక్షంగా మహిళలకు లబ్ధి చేకూర్చడానికి తోడు రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా పొదుపు సంఘాల మహిళలకు గత మూడున్నరేళ్లలో తక్కువ వడ్డీకీ రూ.1.05 లక్షల కోట్ల మేర బ్యాంకు రుణాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇప్పించింది. ఫలితంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల్లో మూడో వంతుకు పైగా సంఘాలు రూ.10 లక్షలకు పైగా రుణాలు పొందాయి.

చంద్రబాబు అధికారంలో ఉండగా డ్వాక్రా రుణమాఫీ హామీని నిలబెట్టుకోకుండా మోసం చేయడంతో మహిళా సంఘాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. ఇప్పుడు పొదుపు సంఘాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో 99.7 శాతం సంఘాలు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లిస్తూ దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

బ్యాంకుల నుంచి మునుపెన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున రుణాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు ప్రత్యేకించి పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో అత్యున్నత సంస్థగా భావించే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్‌యూడీఎస్‌టీ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సెర్ప్‌తో శిక్షణ ఇస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement