కౌలురైతుకు సర్కారు భరోసా

Andhra Pradesh Government assurance to the tenant farmer - Sakshi

గడిచిన రెండేళ్లలో 6,87,474 మందికి హక్కు పత్రాల జారీ

ఈ ఏడాది 5 లక్షల సీసీఆర్‌సీల జారీ లక్ష్యం

ఇందులో 4.12 లక్షల మందికి ఇప్పటికే అందజేత

తాజాగా మరో 71,768 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అర్హత 

ఈ 71,768 మందికీ నేడు వైఎస్సార్‌ రైతుభరోసా నిధులు జమ

సాక్షి, అమరావతి: భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కౌలుదారులకు పంటసాగు హక్కు పత్రాలను (సీసీఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వం జారీచేస్తోంది. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆర్‌బీకేల ద్వారా వీటిని అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 6,87,474 మంది కౌలుదారులకు సీసీఆర్‌సీలు జారీచేయగా,  2021–22 సీజన్‌కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 4,12,894 మందికి ఇచ్చారు. వీరిలో 3,60,635 మంది కొత్తవారు కాగా.. 52,259 మంది పాత కౌలుదారులకు రెన్యూవల్‌ చేశారు. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 1,11,212 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 1,05,515 మందికి జారీచేశారు. ఇక 2019లో అమలులోకి వచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం ఆధారంగా జారీ చేస్తున్న సీసీఆర్‌సీల ద్వారానే పంట రుణాలు, వడ్డీ, పెట్టుబడి రాయితీలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా కూడా కౌలురైతులకు వర్తింపజేయనున్నారు.తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునేందుకు కూడా ఈ సీసీఆర్‌సీలే ప్రామాణికం. ఇదిలా ఉంటే.. లేనిపోని అపోహలతో కౌలుదారులకు సీసీఆర్‌సీలు ఇచ్చే విషయంలో ముందుకురాని భూయజమానులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 

నేడు 71,768 మందికి వైఎస్సార్‌ రైతు భరోసా
గతనెల 12 నుంచి 30 వరకు మేళాలు నిర్వహించారు. వీటిల్లో  సీసీఆర్‌సీలు పొందిన వారిలో 96,335 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. వీరిలో 70,098 మందిని అర్హులుగా గుర్తించారు. అత్యధికంగా గుంటూరు 14,712 మంది, అత్యల్పంగా అనంతపురంలో 570 మంది అర్హత పొందారు. ఇక దేవదాయ భూములు సాగుచేస్తున్న వారిలో 2,103 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,670 మందిని అర్హులుగా లెక్క తేల్చారు. ఇలా తాజాగా అర్హత పొందిన 71,768 మందికి ఈనెల 12న రైతుభరోసా కింద తొలి విడతగా రూ.7,500లు జమ చేయనుంది. అలాగే, అటవీ భూములు సాగు చేస్తున్న 86,254 మంది సాగుదారులకు ఇప్పటికే మొదటి విడతగా రూ.7,500ల చొప్పున ప్రభుత్వం రైతుభరోసా సొమ్ము జమ చేసింది.

భూయజమానులు సహకరించాలి
అర్హులైన ప్రతీ కౌలుదారులని సీసీఆర్‌సీలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులున్నారని అంచనా. వారిలో గడిచిన రెండేళ్లలో 6.87 లక్షల మందికి ఇచ్చాం. ఈ ఏడాది వాటిని రెన్యువల్‌తో పాటు కొత్తగా 5లక్షల కార్డులివ్వాలన్నది లక్ష్యం. ఇప్పటికే రెన్యూవల్‌తో సహా 4.12లక్షల మందికి కార్డులిచ్చాం. అర్హులందరూ ఆర్‌బీకేల ద్వారా కార్డులు పొందాలి. ఇందుకు భూ యజమానులు సహకరించాలి.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top