జిల్లా బాలల సంక్షేమ కమిటీలకు మళ్లీ నోటిఫికేషన్
వరుసగా ఇది నాల్గవసారి
మూడవ నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూలూ పూర్తి
అర్హులుగా 821 మందిని గుర్తించి ఇంటర్వ్యూలు
నియామకాల సమయంలో 4వ నోటిఫికేషన్
బాలల సంక్షేమంపై బాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం
రాజకీయ సమీకరణలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బాలల హక్కులతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోంది. బాలల సంక్షేమ కమిటీల (సీడబ్యూసీ)ల నియామకం విషయంలో దారుణ నిర్లక్ష్య విధానం దీనికి అద్దంపడుతోంది. సీడబ్ల్యూసీల నియామకానికి వరుసగా నాలుగోసారి శనివారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 10 వరకు దరఖాస్తులు చేసుకోవాలని బాలల సంక్షేమ, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2024 నవంబర్‌లో ముగిసిన సీడబ్ల్యూసీల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే మూడు పర్యాయాలు నోటిఫికేషన్లు జారీ చేసి, తదుపరి ఆ ప్రక్రియలను పక్కనపడేసింది. అధికార పార్టీకి చెందిన వారిని నియమించుకోవడమే లక్ష్యంగా బాలల సంక్షేమంపై ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నవ్వి పోదురుగాక.. నాకేంటి..
నవ్వులపాలు అవుతున్నా, రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 28 జిల్లాల్లో చైర్మన్, నలుగురు సభ్యులు చొప్పున మొత్తం 140 మందిని ఒకే జీఓ ద్వారా నియమించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రధానంగా మూడు దశల అనంతరం (దరఖాస్తులకు ఆహ్వానం, స్రూ్కటినీ, ఇంటర్వ్యూలు) నియామకాలు జరుగుతాయి. రెండుసార్లు నోటిఫికేషన్ల ప్రక్రియ ఇంటర్వ్యూల దశ వరకూ వచ్చి ఎటువంటి నియామకాలు జరక్కుండా మురిగిపోయాయి.
మూడవదశ నోటిఫికేషన్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,462 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 641 మందిని అనర్హులుగా తేల్చి 821 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఆగస్టు రెండవ వారంలో 9 జిల్లాలకు కేవలం 33 మందిని నియమించింది. అన్ని జిల్లాలకు పూర్తిస్థాయిలో నియామకాలు చేయాల్సిన దశలో ‘మళ్లీ నోటిఫికేషన్’ అంటూ మొదటికి వచ్చింది. ఇప్పటికే అర్హులను తేల్చిన వారిలో అధికార కూటమికి చెందిన వారు లేకపోవడంతో తమ వారిని నియమించుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు మళ్లీ నోటిఫికేషన్‌కు చర్యలు చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తాజా నోటిఫికేషన్ ఇప్పించినట్టు సమాచారం
హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. వేగంలేని వైనం
బాలల న్యాయ చట్టం–2015 నిబంధనలు ప్రకారం ఈ పదవులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 7 సంవత్సరాలు బాలల కోసం పని చేసిన అనుభవం ఉండాలి. దాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు రిటైర్డ్ జడ్జి కృపాసాగర్ అధ్యక్షతన మూడవ నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంటర్వ్యూలను ముగించారు. అయినప్పటికీ ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదన్న విషయం హైకోర్టు దృష్టికి రావడంతో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమరి్పంచాలని ఈ ఏడాది జూన్ 26 చీఫ్ జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందుకు జూలై 22 వరకు గడువు ఇచ్చింది. అయితే ఎంపికైన అభ్యర్థుల గురించి పోలీసు విచారణ పెండింగ్‌లో ఉందని పోలీసు శాఖపై నెపం మోపి కోర్టులో వాయిదా కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సెపె్టంబర్ 23 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. అయినా పూర్తి నియామకాల దిశగా ప్రభుత్వం వేగవంతమైన సమగ్ర, పటిష్ట చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇంటర్వ్యూలకు రూ. లక్షల్లో వ్యయాలు
గత మూడు పర్యాయాల నోటిఫికేషన్‌లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, రెండు పర్యాయాలు ప్రైవేట్ హోటల్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు రూ.20 లక్షలకుపైగా ప్రజాధనం వృథా చేసింది. మూడోసారి ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి మమ అనిపించింది. మొత్తంగా ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని వేలాది ఆశావహులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు.
ఆ 33 మందికి మినహాయింపు
మూడవ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆగస్టు రెండవ వారంలో తొమ్మిది జిల్లాలకు నియమితులైన కేవలం 33 మందిని ప్రభుత్వం తాజా 4వ నోటిఫికేషన్ నుంచి మినహాయించింది. అయితే వారిలో 20 మంది మాత్రమే ఇప్పటికి బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. వారిని అలాగే వదిలేసి మిగిలిన నియామకాలకు సంబంధించి మళ్లీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.


