సత్తా చాటిన ఆంధ్రా అథ్లెట్లు

Andhra athletes tops first in third national sports competition - Sakshi

ట్రిపుల్‌ జంప్, డిస్కస్‌ త్రోలో మనమే ఫస్ట్‌

బాడ్మింటన్, హాకీ, జూడో, వాలీబాల్‌ పోటీల్లోనూ ఏపీ జయకేతనం

పతకాల పంట పండిస్తున్న తెలంగాణ

ఉత్సాహంగా ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల జాతీయ పోటీలు

సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడా పోటీల్లో సోమవారం ఆంధ్రా విద్యార్థులు అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. విజయవాడ లయోలా కాలేజీ, గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ మైదానాలలో గిరిజన బాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. రన్నింగ్, బాడ్మింటన్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

రెండవ రోజు క్రీడల్లో ఆంధ్రాతోపాటు తెలంగాణ క్రీడాకారులు రాణించారు. ముఖ్యంగా మెడల్స్‌ జాబితాలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇప్పటివరకు తెలంగాణ క్రీడాకారులు వివిధ విభాగాల్లో 27 పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో 14 స్వర్ణం, 4 రజతం, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 11 పతకాలు దక్కించుకుంది. వీటిలో 2 స్వర్ణాలు, 5 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌ మెడల్స్‌ జాబితాలో గుజరాత్‌ 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌కు 6 స్వర్ణం, 3 రజతం, 11 కాంస్య పతకాలున్నాయి. 

నాగార్జున మైదానంలో..
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగిన అథ్లెటిక్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్‌–19 బాలికల ట్రిపుల్‌ జంప్‌లో 9.90 మీటర్లతో రాష్ట్రానికి  చెందిన డి.శ్రీజ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 9.55 మీటర్లతో తెలంగాణకు చెందిన బొంత స్నేహ రెండో స్థానం, 9.30 మీటర్లతో మూడో స్థానంలో ఏపీకి చెందిన శ్రీవల్లి నిలిచింది.

అండర్‌–14 బాలుర విభాగంలో డిస్కస్‌ త్రోలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 29.79 మీటర్లతో మొదటి స్థానాన్ని మన రాష్ట్రానికి చెందిన బోయ మహేంద్ర దక్కించుకోగా.. 25.99 మీటర్లతో రెండో స్థానంలో ఏపీకి చెందిన వి.సుశాంత్‌రెడ్డి, 24.53 మీటర్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేశ్‌ చౌహాన్‌ మూడో స్థానంలో నిలిచారు. అండర్‌–19 హై జంప్‌ బాలుర కేటగిరీలో 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన ఎం.రంజిత్‌ మొదటి స్థానం, 1.64 మీటర్లతో ఒడిశాకు చెందిన హెచ్‌.దీపక్‌ కుమార్‌ రెండో స్థానం, 1.61 మీటర్లతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన  కె.అనిష్‌ మూడో స్థానం దక్కించుకున్నారు.

అండర్‌–19 800 మీటర్ల రన్నింగ్‌ బాలుర విభాగంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్‌ కొవచి 2.05.90 సమయంలో లక్ష్యం చేరి తొలి స్థానంలోను, 2.08.80 సమయంలో లక్ష్యం చేరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రంజిత్‌ కుమార్‌ రెండో స్థానంలోను, 2.12.30 సమయంలో లక్ష్యం చేరి జార్ఖండ్‌కు చెందిన అలోక్‌ మూడో స్థానంలో నిలిచారు. 

లయోలా క్రీడా మైదానంలో..
విజయవాడ లయోలా క్రీడా మైదానంలో తైక్వాండో అండర్‌–14 పోటీలు ఆద్యంతం ఉత్సహభరితంగా సాగాయి. 21:23 వెయిట్‌ బాలుర కేటగిరీ ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన చౌదరి స్మిత్‌కుమార్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన నర్సింగ్‌ టెకం విజయం సాధించారు. 23:25 వెయిట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మహారాష్ట్రకు చెందిన రితేష్‌రాజు వడావ్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష మేరవి విజయం సాధించారు.

బాడ్మింటన్‌ అండర్‌–19 కేటగిరీ 52–56 కేజీలలో హిమాచల్‌ప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్‌ గెలుపొందింది. అండర్‌–19 కేటగిరీ 57–60 కేజీల విభాగంలో మధ్యప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్‌ గెలుపొందింది. హాకీ బాలుర 7వ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌–కర్ణాటక మ్యాచ్‌లో 1–0 తేడాతో ఆంధ్రప్రదేశ్‌ గెలిచింది. జూడో (బాలికలు) అండర్‌–14 కేటగిరీ ఫ్రీస్టయిల్‌ 39, 42, 46 విభాగాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌ బాలికలు విజయం సాధించారు. వాలీబాల్‌ పోటీల్లోనూ హిమాచల్‌ప్రదేశ్‌పై ఏపీ జట్టు విజయకేతనం ఎగురవేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top