
పెళ్లి పేరుతో ఘరానా మోసం
నమ్మించి.. నట్టేట ముంచి
నగలు, నగదు, కారుతో జంప్
భార్యపై పోలీçసులకు ఫిర్యాదు
బెళుగుప్ప(అనంతపురం): లగ్జరీ జీవితం ఆమె కల. పెళ్లి పేరిట ఆ కల నెరవేర్చాలనుకుంది. ఇందుకు దివ్యాంగుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంది. అనుకున్న విధంగా నగదు, నగలు, కారు సమకూర్చుకున్న తర్వాత.. భర్తతో గొడవ పెట్టుకుని ఉడాయించింది. అవసరాలన్నీ తీర్చి బికారిగా మారిపోయిన భర్త.. తన భార్య మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి.
బెళుగుప్ప మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం ఫయాజ్ దివ్యాంగుడు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షబానా నచ్చింది. అటువైపు నుంచి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో అనంతపురంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనంతపురంలోనే ఓ ఇంటిని తీసుకుని కాపురం పెట్టారు.
నమ్మించి.. వంచించి..
భార్య చూపిన అమితమైన ప్రేమకు భర్త ఫిదా అయిపోయాడు. ఆమె సంతోషం కోసం ఏది అడిగినా కాదనలేకపోయేవాడు. అలా తన మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో షబానా తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. మొదట తన అక్క జరీనా కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భర్త ఫయాజ్ పేరిట రూ.30 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంది. ఆయన వేతనం నుంచి 2024 ఫిబ్రవరి నుంచి రూ.60 వేల చొప్పున ఈఎంఐ కట్ అవుతూ వస్తోంది. ఆ తర్వాత అనంతపురంలోని సొంతింటిని కూడా విక్రయించి రూ.40 లక్షలు తీసుకుంది. దీంతో ఏడాదిగా బెళుగుప్పలోని అద్దె ఇంటికి మకాం మార్చారు.
ఈ క్రమంలోనే అనంతపురంలో ఫయాజ్ పేరున ఉన్న ప్లాట్‌ను సైతం విక్రయించి రూ.7 లక్షలు తీసుకుంది. అలాగే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు తులాల బంగారు నగలు కొనుగోలు చేయించింది. రాకపోకలకు అనువుగా ఉండాలని రూ.6 లక్షల విలువైన కారు కొనుగోలు చేయించింది. ఇలా తన అవసరాలు తీర్చుకున్న తరువాత గత నెల 28న బెళుగుప్పలోని నివాసంలో గొడవపడిన షబానా.. ఆ మరుసటి రోజే (29న) తన తల్లిదండ్రులు షమి, అలీ, అక్క జరీనాను పిలిపించి దివ్యాంగుడైన భర్తను ఇంట్లోనే బంధించి.. సామగ్రిని వాహనంలో వేసుకుని కారుతో సహా తెనాలికి వెళ్లిపోయింది.
విలాసవంతమైన జీవితానికి అవసరమైన డబ్బు కోసం తనను వాడుకుని వంచనకు గురి చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫయాజ్ బెళుగుప్ప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ మంగళవారం మీడియాకు తెలిపారు.