
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకల ఉన్మాదం
వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో దారుణ ఘటన
పెల్లుబికిన ప్రజాగ్రహజ్వాల.. దోషులను పట్టుకోండి... మీ కాళ్లు పట్టుకుంటా.. పోలీసులకు సర్పంచ్ వేడుకోలు
సమగ్ర నివేదికకు కలెక్టర్, ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలు
వెదురుకుప్పం/తిరుపతి మంగళం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకలు దారుణానికి ఒడిగట్టాయి. వెదురుకుప్పం మండలం, బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. పక్కా ప్రణాళికతోనే టీడీపీకి చెందిన రౌడీ మూకలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి.
తొలి నుంచి వ్యతిరేకమే..
సర్పంచ్ చొక్కా గోవిందయ్య, దళిత నాయకులు కలిసి దేవళంపేటలో 2023లో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పట్లోనే స్థానిక టీడీపీ నాయకులు సతీష్‌నాయుడు, పయణితో పాటు వారి అనుచరులు కొంతమంది ఈ విగ్రహాన్ని నెలకొల్పకుండా చేయాలని విఫలయత్నం చేశారు. ఆ తర్వాత సైతం అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ లేకుండా చేయాలని అనేకమార్లు ప్రయత్నించారు.
కూటమి ప్రభుత్వం రావడంతో సతీష్‌నాయుడు ఎమ్మెల్యే థామస్ ప్రధాన అనుచరుడినని చెప్పుకుంటూ స్థానిక సర్పంచ్ గోవిందయ్యను పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. విగ్రహం ఉన్న ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే సర్పంచ్ గోవిందయ్యకు సమాచారం అందించారు.
జరిగిన ఘటనను 100కు డయల్ చేసి చెప్పడంతో నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్, కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఘటనపై సర్పంచ్ గోవిందయ్య వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా న్యాయం చేయాలి’ అంటూ రోడ్డుపై సర్పంచ్ పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
ఘటనకు కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత, ప్రజా సంఘాల నేతలు దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ దేవళంపేటకు చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అంతకుమునుపే అనుమానితులైన సతీష్‌నాయుడు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, డీఆర్‌ఓ, వెదురుకుప్పం తహసీల్దార్ బాబు దేవళంపేటకు చేరుకుని ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళన కారులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నిప్పు పెట్టిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో శుక్రవారం రాత్రి అధికారులు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ఆగమేఘాల మీద అధికారులు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే..
ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో ఇలాంటి అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అంబేడ్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. జరిగిన ఘటనను సుమోటోగా తీసుకుని అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి. ఈనెల 25 లోపు న్యాయం జరగకుంటే 15 వేల మందితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖబడ్దార్. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి
జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం
ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు శుక్రవారం ఎంపీ ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుమూర్తి ఫిర్యాదు చేసిన రెండు గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిర్దిష్ట గడువులోపు నివేదిక అందించనట్లయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్ట్ అధికారాలను వినియోగించి, సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.