ష్‌.. గప్‌చుప్‌! | The adulterated liquor syndicate of TDP elders is exploiting the state | Sakshi
Sakshi News home page

ష్‌.. గప్‌చుప్‌!

Oct 4 2025 3:57 AM | Updated on Oct 4 2025 3:57 AM

The adulterated liquor syndicate of TDP elders is exploiting the state

అమరావతి నుంచి పెద్దల ఆదేశం 

కల్తీ మద్యం దందాకు ప్రభుత్వ రక్షా కవచం

ప్రభుత్వ కీలక నేతలే కల్తీ మద్యం రింగ్‌ మాస్టర్లు 

నియోజకవర్గ నేతలే సూత్రధారులు 

పాత్రధారులైన టీడీపీ ఛోటా నేతల అరెస్టుతో సరి 

యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్‌ దోపిడీ 

జిల్లాలు, రీజియన్ల వారీగా రాకెట్‌ వ్యవస్థీకృతం 

తయారీ నుంచి అమ్మకాల వరకు సిండికేట్‌ నెట్‌వర్క్‌ 

రాష్ట్రంలో మూడో వంతు అమ్మకాలు కల్తీ మద్యమే  

తొలి ఏడాదే రూ.5,280 కోట్ల దోపిడీ

సాక్షి, అమరావతి:  దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల కల్తీ మద్యం సిండికేట్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరితెగించి కల్తీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌ దుకాణాలు.. ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లోనే ఉండటంతో తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్లు కొల్లగొట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇంతటి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుండటం విస్మయ పరుస్తోంది. 

అనకాపల్లి, ఏలూరు, పాలకొల్లు, గూడూరు, తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం రాకెట్‌ బాగోతం బయట పడుతోంది. ఆ అయిదు సందర్భాల్లోనూ పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కల్తీ మద్యం రాకెట్‌ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై మాత్రం ఈగ వాలనివ్వ లేదు. 

తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం బయట పడిన రాకెట్‌ వెనుక సూత్రధారుల పేర్లు బయట పడకుండా అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేయడం గమనార్హం. ఎందుకంటే ఈ దందా రింగ్‌ మాస్టర్‌ అన్నమయ్య జిల్లా టీడీపీ కీలక నేత.. తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి మరో టీడీపీ నేత సూత్రధారి కావటమే దీనికి కారణం.  

కీలక టీడీపీ నేతే రింగ్‌ మాస్టర్‌.. నియోజకవర్గ నేతే సూత్రధారి 
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువు సమీపంలో బయట పడిన భారీ కల్తీ మద్యం రాకెట్‌పై వాస్తవాలు కప్పిపుచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్న భారీ దందా విభ్రాంతి కలిగిస్తోంది.

ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్‌ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన జనార్దనరావు గురించి ఓ మాట చెప్పి సరిపెట్టారు. కానీ రాయలసీమ స్థాయి కల్తీ మద్యం రాకెట్‌ వెనుక రింగ్‌ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పందించక పోవడం గమనార్హం. ఎందుకంటే ఈ భారీ రాకెట్‌ రింగ్‌ మాస్టర్‌ ఎవరో కాదు.. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతే కాబట్టి. 

ఇక ములకలచెరువులో కల్తీ మద్యం యూనిట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తోంది తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ కీలక నేతే. ఆ విషయం ఆ యూనిట్‌పై దాడి చేసిన తర్వాతే ఎక్సైజ్‌ శాఖ అధికారులకు తెలిసింది. కల్తీ మద్యం తయారీ యూనిట్‌పై ఎక్సైజ్‌ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల  మధ్య దాడి చేశారు. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఆ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ కల్తీ మద్యం రాకెట్‌ వెనుక అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతే రింగ్‌మాస్టర్‌ అని, తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి నేత సూత్రధారి అని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అమరావతిలోని ఉన్నతాధికారులకు తెలిపారు. 

దాంతో తాము చెప్పే వరకు తొందర పడవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. రింగ్‌ మాస్టర్, సూత్రధారి గురించి ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ముఖ్యనేతకు సమాచారం ఇచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వ పెద్దలు వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్నారు. విష­యం తెలియడంతో సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు తర్జనభర్జనలు పడ్డారు. ఇప్పటికే టీడీపీ మద్యం సిండికేట్‌ వ్యవహారాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కీలక నేతే కల్తీ మద్యం రాకెట్‌ రింగ్‌ మాస్టర్, నియోజకవర్గ స్థాయి నేత సూత్రధారి అని బయట పడితే ప్రభుత్వం పరువు బజారున పడుతుందని సందేహించారు. 

అందుకే ఈ వ్యవహారంలో కీలక నేతల పేర్లు బయటకు రాకుండా చూడాలని ప్రభుత్వ ముఖ్యనేత ఎక్సైజ్‌ శాఖను ఆదేశించారు. దాంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం 6 గంటల తరువాత మీడియా సమావేశం నిర్వహించి కేవలం మండల స్థాయి టీడీపీ నేత, పని చేస్తున్న కూలీల అరెస్టుతో విషయాన్ని కప్పి పుచ్చేందుకు యత్నించారు.   

అంతటా అదే గూడు పుఠాణి  
రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా వెనుక టీడీపీ కీలక నేతలే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కానీ ఎక్కడా కీలక నేతల పేర్లు బయటకు రాకుండా ప్రభుత్వం కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచి్చన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా బయట పడింది. తాజాగా అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్ని సందర్భాల్లోనూ పాత్రధారుల అరెస్టుతో సరిపెట్టారు తప్ప.. సూత్రధారుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.    

రేపల్లె నేతే.. దక్షిణాంధ్ర సిండికేట్‌ లీడర్‌ 
ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా సాగిన టీడీపీ కల్తీ మద్యం రాకెట్‌ ఇటీవల బట్టబయలైంది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్టు కూడా వెల్లడైంది. ఈ కేసులో టీడీపీ సిండికేట్‌ సభ్యుడైన వీరాంజనేయులు అరెస్టుతో సరిపెట్టారు. కానీ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కల్తీ మద్యం సిండికేట్‌కు రింగ్‌ మాస్టర్‌ రేపల్లెలో ఉన్నారు. ఆయన  ప్రధాన అనుచరులే సూత్రధారులు. ప్రభుత్వ కీలక నేత కావడంతో ఆయనకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.   

టీడీపీ సీనియర్‌ నేత కుటుంబమే రింగ్‌ లీడర్‌..  
అనకాపల్లి జిల్లా కేంద్రంగా టీడీపీ సిండికేట్‌ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో అంటే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కల్తీ మద్యం దందా సాగిస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఈ రాకెట్‌ బయట పడితే  టీడీపీ నేతలైన రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావులను అరెస్టు చేశారు. 

కానీ అసలు ఉత్తరాంధ్ర స్థాయిలో కల్తీ మద్యం దందా నర్సీపటా్ననికి చెందిన టీడీపీ కీలక నేత కుటుంబ అండదండలతోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. ఎక్సైజ్‌ శాఖ అధికారులు కనీసం ఆ కుటుంబ సభ్యులను ప్రశి్నంచే సాహసం కూడా చేయలేకపోయారు.   

వివాదాస్పద టీడీపీ నేతే గోదావరి జిల్లాల కల్తీ మద్యం డాన్‌ 
అత్యంత వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం డాన్‌గా చెలరేగిపోతున్నారు. అందుకే పాలకొల్లులో కల్తీ మద్యం రాకెట్‌పై ఎకైŠస్‌జ్‌ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయారు. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 

కాగా.. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనే దాడి చేసే చరిత్ర ఉన్న టీడీపీ వివాదాస్పద ప్రజాప్రతినిధి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నారని తెలియడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు చోద్యం చూడాల్సి వస్తోంది. పాలకొల్లు కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత పులి శీతల్‌ అరెస్టుతో సరిపెట్టారు తప్ప.. టీడీపీ ప్రజాప్రతినిధి వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు.  

టీడీపీ సిండికేట్‌ ద్వారానే స్పిరిట్‌ అక్రమ రవాణా 
రాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్‌ దందాను టీడీపీ మద్యం సిండికేట్‌ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. అందుకోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (వాడుక భాషలో స్పిరిట్‌ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. సాధారణంగా ఈ స్పిరిట్‌ కొనుగోలుపై మద్యం డిస్టిలరీలకు పరిమితి ఉంటుంది. కానీ కోవిడ్‌ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్‌ కొనుగోళ్లపై పరిమితిని తొలగించారు. 

ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్‌ను భారీగా కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్‌ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్‌ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్‌ దందాకు కలసి వస్తోంది. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. 

ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్‌ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్‌ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ మద్యంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది.   

సిండికేట్‌ దుకాణాలు, బెల్టు షాపులకు సరఫరా 
టీడీపీ సిండికేట్‌ తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ సిండికేట్‌ గుప్పిట్లోనే ఉన్నాయి. వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలనూ సిండికేట్‌ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యా న్ని బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్‌ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్‌ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం నెట్‌వర్క్‌ అంతా టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.

ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ  
టీడీపీ సిండికేట్‌ సాగిస్తున్న కల్తీ మద్యం దందా విభ్రాంతి కలిగిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 

4.26 కోట్ల ఐంఎఎల్‌ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్‌ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్‌ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్‌ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. తద్వారా మొత్తం క్వార్టర్‌ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్‌ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement