బాబును జైలుకు పంపే వరకు నిద్రపోను: లక్ష్మీ పార్వతి

ACB court Adjourns hearing of Chandrababu Illegal Assets Case To Oct 21 - Sakshi

సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జైలుకు పంపేవరకూ తాను వదిలేది లేదని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసుపై ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతాను. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. కేసు విత్‌డ్రా చేసుకోమని గతంలో చంద్రబాబు నాకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారు’ అని తెలిపారు.

చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ 21​కి వాయిదా
సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై  హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్‌ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు.

కాగా 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్‌ అయింది. అలాగే నేతల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top