తండ్రీకొడుకుల అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా.. విద్యారంగాన్ని బలోపేతం చేసిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్‌మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, లోకేశ్‌ను నిలదీశారు.
ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించి.. సెట్టింగ్‌లు, షూటింగ్‌లు పెట్టి ప్రత్యేక విమానాలపై వెళుతూ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. పాఠశాల సమావేశాలను సైతం రాజకీయ సభలుగా మార్చేసి వైఎస్ జగన్‌పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదన్నారు.
ఆ బడిని తీర్చిదిద్దింది జగనే
‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్‌లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ పాఠశాలను నిర్మిస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నాడు–నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చుచేసి సెట్టింగ్ వేశారు.
పేరెంట్ టీచర్ మీటింగ్‌లను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసి తండ్రీకొడుకులు విఫలమయ్యారు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు.
పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపచేయలేదు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైఎస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా తండ్రీకొడుకులకు లేదు’ అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.


