
‘అల్ ఉమ్మా’తో సంబంధాలున్న అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ అరెస్టు
20 ఏళ్లుగా రాయచోటిలో నివాసం.. 2013 నాటి బెంగళూరు పేలుళ్లలో ప్రమేయం
ఇంట్లో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు.. బాంబుల తయారీ, పేలుళ్లలో సిద్ధహస్తులు
తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరిపైన పలు కేసులు 1999 నుంచి పరారీలో..
వెల్లడించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విద్యాసాగర్
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్‌లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్‌గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.
⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.
⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.
అల్ ఉమ్మా సంస్థతో అనుబంధం
ఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయి.
రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.
సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..
ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.
పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.
⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్‌కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు.
భయం.. భయం..
రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్‌లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.