
పెండింగ్ బకాయిలపై నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె మరింత ఉధృతం
ఇప్పటికే ఉచిత ఓపీ సేవలు నిలిపేసిన ఆస్పత్రులు
ఐపీ, ఇతర సేవలూ నిలిపేస్తామని ‘ఆశ’ అల్టిమేటం
రూ.3,000 కోట్లకుపైగా బకాయి పెట్టిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పెండింగ్ బిల్లులపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమానులు సిద్ధమయ్యాయి. వీరు ఈనెల 15 నుంచి పథకం కింద ఉచిత ఓపీడీ, ఇన్వెస్టిగేషన్స్ సేవలు నిలిపేసి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేకపోవడంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు.
అక్టోబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ నిలిపేసి ఉద్యమం ఉధృతం చేయబోతున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. విజయవాడలో బుధవారం జరిగిన ఆశ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
క్లెయిమ్‌ల పరిశీలనకు 400 రోజులా?
నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,000 కోట్లకుపైగా బకాయిపడిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. రూ.670 కోట్లు బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలిన బిల్లులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో పరిశీలన దశలో ఉన్నాయని ఇటీవల వైద్య శాఖ మంత్రే స్వయంగా ప్రకటించారని అన్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రుల్లో అందించిన చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్‌లను ప్రభుత్వం 45 రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా రూ.2వేల కోట్లకు పైగా బిల్లులను 400 రోజులుగా పరిశీలన దశలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో ఆస్పత్రుల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆస్పత్రులను నిర్వహించలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇప్పటికే సరఫరా చేసిన మందులు, వైద్య పరికరాలకు బిల్లులు కట్టకపోవడంతో అప్పుపై సరఫరా చేయలేమని కంపెనీలు చెబుతున్నాయన్నారు. బయట, బ్యాంకుల్లోనూ అప్పు పుట్టడం లేదన్నారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఆపేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, పాక్షికంగా సేవలు ఆపేసి సమ్మెలోకి వెళ్లామని పేర్కొన్నారు. ప్రజల గురించి తాము ఆలోచించి పాక్షికంగా సమ్మెలోకి వెళితే అదే రోజున రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా ఆగలేదని మంత్రి ప్రకటన చేయడం బాధించిందన్నారు. పెద్ద ఎత్తున బకాయిలతో 50, 100 పడకల ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందన్నారు.
రూ.670 కోట్లు విడుదల చేశాకే చర్చలు
పెండింగ్ బకాయిల కోసం తాము సమ్మెకు పిలుపునిచి్చన ప్రతిసారీ ప్రభుత్వం చర్చలకు పిలిచి కొంత బిల్లులు ఇస్తామని హామీ ఇవ్వడం అనంతరం అమలు చేయకపోవడం పరిపాటిగా మారిందని విజయ్‌కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న రూ.670 కోట్లు బిల్లులు విడుదల చేసి, మిగిలిన నిధుల విడుదలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాకే ప్రభుత్వంతో చర్చలకు వెళతామని తేల్చిచెప్పారు. మొత్తంగా రూ.3,000 కోట్లకు పైగా బకాయి పెట్టి తాము సమస్య లేవనెత్తిన ప్రతీసారి సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న మొత్తాన్నే బకాయి కింద సర్కారు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు.
ఆస్పత్రులకు పూర్తి స్థాయిలో నిధులన్నీ చెల్లించాకే బీమా విధానంలోకి వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత బకాయిలు చెల్లించకుండానే బీమా విధానంలోకి వెళితే ఆస్పత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా విధానం అమలుపైనా ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుత ప్యాకేజీ రేట్లతోనే బీమా విధానానికి వెళితే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందవని వివరించారు. ఆశ ప్రతినిధి డాక్టర్ మురళీ మాట్లాడుతూ పెద్ద మొత్తంలో బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరమవుతున్న పరిస్థితుల్లో వైద్య రంగం అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ఇప్పటికే ఆస్పత్రులు సంక్షోభంలో ఉండటంతో రాష్ట్రంలో భారీ కార్పొరేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికే ఆస్పత్రులకు రూ.3,000 కోట్లు చెల్లించలేని పరిస్థితుల్లో బీమా అమలుకు బడ్జెట్ సరిపోతుందో లేదో ఆలోచించాలన్నారు. సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళితే ప్రజలు ఇబ్బందుల్లో పడతారని వివరించారు.