కోవిడ్‌ సమయంలోనూ దూసుకుపోయిన పోర్టులు

49 Million Tonnes Of Cargo Was Transported Through AP Minor Ports During The Corona Period - Sakshi

7 నెలల్లో 49.45 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా

ఆరు పోర్టుల ఆదాయం రూ.1,923.24 కోట్లు

రాష్ట్ర ఖజానాకు రూ.130.90 కోట్లు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సమయంలో కూడా ఏపీలోని మైనర్‌ పోర్టులు అద్భుత పనితీరును కనబరుస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల కొన్ని నెలల పాటు సరుకు రవాణా ఆగిపోయినా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో పోర్టులు గరిష్ట స్థాయిలో సరుకు రవాణా నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఆరు మైనర్‌ పోర్టులైన కాకినాడ యాంకరేజ్‌, డీప్‌ వాటర్‌, రవ్వ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల ద్వారా ఏప్రిల్‌-అక్టోబర్‌ కాలంలో 49.457 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఈ ఏడు నెలల్లో మొత్తం రూ.1,923.24 కోట్ల వ్యాపార లావాదేవీలను పోర్టులు నిర్వహించగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.130.90 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరింది.

గతేడాది పూర్తి కాలానికి ఈ ఆరు పోర్టుల ద్వారా జరిగిన సరుకు రవాణా 99.44 మిలియన్‌ టన్నులు కాగా, రూ.3,639.81 కోట్ల వ్యాపార లావాదేవీలతో రాష్ట్ర ఖజానాకు రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కాకినాడలోని యాంకరేజ్‌, డీప్‌ వాటర్‌ పోర్టులు సమర్థ పనితీరును కనబరిచాయి. బియ్యం, సిమెంట్‌ ఎగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణంగా మారిటైమ్‌ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ముడి చమురు, కంటైనర్లు, స్టీల్‌, ముడి ఇనుము దిగుమతులు పెరగడంతో పోర్టుల వ్యాపారం పూర్వస్థితికి చేరుకున్నట్లు పేర్కొంటున్నారు.
                                       
మేజర్‌ పోర్టుపై కూడా ప్రభావం తక్కువే..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ మేజర్‌ పోర్టుపై కూడా కోవిడ్‌ ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో(ఏప్రిల్‌-సెప్టెంబర్‌) సరుకు రవాణాలో క్షీణత నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 34.75 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 32.77 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది. గత 2 నెలల నుంచి సరుకు రవాణా పెరగడంతో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి వృద్ధి నమోదు చేయగలమన్న ధీమాను పోర్టు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

మైనర్‌ పోర్టుల్లో ఇలా..

పోర్టు 2019-20 సరుకు ఆదాయం 2020-21 సరుకు ఆదాయం (అక్టోబర్‌ వరకు)
యాంకరేజ్‌ 1.143 34.24 1.378 20.78
రవ్వ 0.735 3.96 0.334 1.80
డీప్‌ వాటర్‌ 14.97 534.00 9.03 326.00
కృష్ణపట్నం 48.142 1,965.43 21.345 1,024.74
గంగవరం     34.45 1,102.18      17.37 549.92
మొత్తం 99.44 3,639.81 49.457 1,923.24

నోట్‌: సరుకు రవాణా మిలియన్‌ టన్నుల్లో, ఆదాయం రూ.కోట్లలో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top