వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించాలి | 56th graduation ceremony of Acharya NG Ranga University | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించాలి

Published Thu, Jun 20 2024 5:45 AM | Last Updated on Thu, Jun 20 2024 5:45 AM

56th graduation ceremony of Acharya NG Ranga University

ఇందుకోసం వినూత్న విధానాలను రూపొందించాలి

విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ సూచన

ఘనంగా ఆచార్య ఎన్‌.జి.రంగా వర్సిటీ 56వ స్నాతకోత్సవం

బాపట్ల: వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం వినూత్న విధానాలను రూపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ సూచించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డా.బి.వి.నాథ్‌ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 56వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మంటే కేవలం ఆహారోత్పత్తి మాత్రమే కాదని, జీవితాన్ని పోషించడమనే వాస్తవాన్ని విద్యార్థులంతా గ్రహించాలని గవర్నర్‌ సూచించారు. 

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఎప్పటికీ ఆపొద్దని, వ్యవసాయ రంగ భవిష్యత్‌ విద్యార్థుల భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను అర్ధం చేసుకుంటూ, సృజనాత్మకతతో మేధస్సును పెంచుకోవా­లని  సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోందని, ఇది మనం గర్వించదగ్గ విషయమన్నారు. 

పెరుగుతున్న జనాభా, వాతా­వరణ ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ప్రశ్నిస్తున్నా... విద్యార్థులు తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ, డ్రోన్, రిమోట్‌ సెన్సింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌వంటి నూతన సాంకేతికతలను క్షుణ్ణంగా నేర్చుకుని రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ చదువును పుట్టిన గ్రామాల సౌభాగ్యానికి వినియోగిస్తే వికసిత భారత్‌ సాధ్యపడుతుందన్నారు. 

అనంతరం విశ్వవిద్యాలయ నివేదికను వర్సిటీ ఉప కులపతి డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మీ దేవి సమర్పించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా.హిమాన్షు పాఠక్‌ కళాశాల, విశ్వవిద్యాలయ ఉన్నతిని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవ సభను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డా.జి.రామచంద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల  ఎమ్మెల్యే వేగేశ్న  నరేంద్ర వర్మ, కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వి. శ్రీనివాసరావు,  యూనివర్సిటీ అధికారులు, వివిధ కళాశాలల అసోసియేట్‌ డీన్లు,  ప్రొఫెసర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement