జీఎస్టీ పరిహారం కింద ఏపీకి 543 కోట్లు విడుదల: కేంద్ర మంత్రి

543 Crore Released To AP Under GST Compensation, Says Central Minister - Sakshi

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్‌ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏప్రిల్‌ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని తెలిపారు.

2017లో జీఎస్టీ చట్టం అమలులోనికి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తాలను పూర్తిగా విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జీఎస్టీ వసూళ్ళు గణనీయంగా తగ్గాయని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం వాటా పెరిగింది. కానీ ఆ మేరకు చెల్లింపులు చేయడానికి జీఎస్టీ కాంపెన్సేషన్‌ ఫండ్‌లో చాలినంత నిధులు లేవని అన్నారు.
చదవండి: ‘2021 రబీలో తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు లేవు’

జీఎస్టీ వసూళ్ళలో ఏర్పడిన భారీ లోటు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలపై జీఎస్టీ కౌన్సిల్‌లో పలుమార్లు జరిపిన చర్చల అనంతరం 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్రాలకు 1 లక్షా 10 వేల కోట్లు, 1 లక్షా 59 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. జీఎస్టీ రెవెన్యూలో తరుగుదలను పూడ్చేందుకు కేంద్రం క్రమం తప్పకుండా జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

జీఎస్టీ కంపెన్సేషన్‌ ఫండ్‌ నుంచే కాకుండా రుణాల రూపంలో రాష్ట్రాలకు నిధులు  విడుదల చేసినప్పటికి కూడా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలగాను జీఎస్టీ కాంపెన్సేషన్‌ కింద కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు ఇంకా 51 వేల 798 కోట్ల రూపాయలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. జీఎస్టీ అమలులోనికి వచ్చినప్పటి నుంచి అయిదేళ్ళపాటు రాష్ట్ర పన్నుల రాబడిలో ఏర్పడే లోటును ఏటా 14 శాతం వరకు జీఎస్టీ నష్టపరిహారం కింద చెల్లించేలా జీఎస్టీ చట్టంలో పొందుపరచినట్లు ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top