కాకాణికి 14 రోజుల రిమాండ్‌ | 14 Days Judicial Remand For Kakani Govardhan Reddy In Illegal Case, More Details Inside | Sakshi
Sakshi News home page

కాకాణికి 14 రోజుల రిమాండ్‌

May 27 2025 6:07 AM | Updated on May 27 2025 9:00 AM

14 Days Judicial Remand for Kakani Govardhan Reddy

కాకాణిని వెంకటాచలంలోని జైలుకు తీసుకువచ్చిన పోలీసులు

రుస్తుం మైనింగ్‌ వ్యవహారంపై అక్రమ కేసు నమోదు

వెంకటగిరి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్న రుస్తుం మైన్స్‌లో తవ్వకాలకు సంబంధించి కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం గూడూరు అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. వెంకటగిరి జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌.విష్ణువర్మ ఈ కోర్టుకు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల పాటు కాకాణికి రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను పోలీసులు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న సెంట్రల్‌ జైలుకు తరలించారు.

రెండు గంటల పాటు వాదోపవాదాలు
రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ జరిగిందందటూ నమోదు చేసిన కేసు అక్రమం అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు తమ వాదనలు వినిపించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో లోపాలున్నాయని, అరెస్ట్‌ సమయంలో కాకాణి కుటుంబసభ్యులకు తెలియజేయలేదని వివిధ లోపాలను ఎత్తిచూపారు. 

అనారోగ్య సమస్యల కారణంగా కాకాణికి స్పెషల్‌ కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో మానవతా దృకృథంలో ఆయా సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతోపాటు వారానికి రెండుసార్లు కాకాణి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు జైల్లో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పించారు.

–రుస్తుం మైన్స్‌లో తవ్వకాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 16 జిల్లా ఇన్‌చార్జి మైనింగ్‌ డీడీ బాలాజీనాయక్‌ ద్వారా అధికార టీడీపీ నేతలు పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ అక్రమ కేసులో.. ముగ్గురు నిందితులను చేర్చారు. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పొందారు. అయితే, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో భాగంగా పోలీసులు మార్చి 28న ఆ ఎఫ్‌ఐఆర్‌కు కొనసాగింపుగా రిమాండ్‌ నివేదిక ద్వారా ఏ4గా మాజీ మంత్రి కాకాణిని చేర్చారు.
 
అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు
–కాకాణికి ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ భరోసా
–బెయిల్‌పై ఆరా తీసిన వైఎస్సార్‌సీపీ అధినేత
వెంకటగిరి(సైదాపురం): అక్రమ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. ‘‘నేనున్నాను’’ అని భరోసా ఇచ్చారు. కాకాణిని సోమవారం వెంకటగిరి కోర్టుకు తీసుకురావడంతో ఆయనకు బెయిల్‌ విషయమై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తితో ఫోన్‌ ద్వారా ఆరా తీశారు.

కోర్టు దగ్గర ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా కాకాణితో మాట్లాడారు. ‘‘అన్నా.. నీకు అండగా నేనున్నా.. నీవు అధైర్య పడొద్దు.. న్యాయం గెలుస్తుంది.. నీవు నిష్కళంకుడిగా బయటకు వస్తావు’’ అంటూ వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో కాకాణితో  రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. కాకాణి కుటుంబ సభ్యులను కూడా వైఎస్‌ జగన్‌ ఫోన్‌ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. రిమాండ్‌ విధించిన విషయమై కూడా వైఎస్‌ జగన్‌కు స్థానిక నేతలు సమాచారం ఇచ్చారు. సోమవారం వెంకటగిరిలో జరిగిన పరిణామాలన్నిటినీ వైఎస్‌ జగన్‌కు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement