
కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం వరకు ఆమెను మోసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెలగలపాలెం పంచాయతీ శీకాయాకపాలెంలో పీవీటీజీల వీధికి చెందిన కొర్రా లీలావతికి ఆదివారం పురిటినొప్పులు వచ్చాయి.
వెంటనే కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. రోడ్డు వసతి లేకపోవడంతో 108 వాహనం గ్రామం వరకు రాలేకపోయింది. దీంతో ఈఎంటీ అశోక్‌కుమార్, పైలట్ నవాజ్ ఆమెను స్పైన్‌కార్డుపై మోసుకుని ఆ వాహనం వద్దకు తీసుకొచ్చారు. అక్కడినుంచి 11 కిలోమీటర్ల దూరంలోని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.
ఫోన్ చేసినా రాని అంబులెన్స్.. పసికందు మృతి
» నిండు గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన బంధువులు
» వైద్యం అందక ఆటోలోనే మృతి చెందిన శిశువు
» పాడేరు ఐటీడీఏ సమీపంలో విషాదం
పాడేరు: ఫోన్‌చేసి రెండు గంటలైనా 108 అంబులెన్స్ రాలేదు. చివరకు నిండు గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రసవించింది. వైద్యం చేసే దిక్కులేక కొద్దిసేపటికే శిశువు దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారు ముల్లుమెట్ట వీధికి చెందిన గెమ్మెలి శాంతి నిండు గర్భిణి. శనివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేశారు.
రెండు గంటలైనా 108 వాహనం రాకపోవడంతో ముల్లుమెట్ట నుంచి సిల్వర్ నగర్ వరకు సుమారు అర కిలోమీటర్ డోలి కట్టి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె ఆటోలోనే ప్రసవించింది. కొద్దిసేపటికే శిశువు మృతి చెందింది. అదే ఆటోలో మృతశిశువుతో పాటు తల్లిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పురిటి నొప్పులు వచ్చిన వెంటనే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు విషయం చెప్పామన్నారు.
కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఈ సమయంలో తాము అక్కడకు రాలేమని చెప్పి ఫోన్ పెట్టేశారన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణి శాంతికి ఏనాడు కూడా పౌష్టికాహారం అందించలేదని ఆరోపించారు. 108 రాకపోవడంతో పాటు వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.