తొలి విడత పంచాయతీ ఎన్నికలకు వేళయ్యింది. జిల్లాలోని 13 మండలాల్లో ఇన్నాళ్లూ ప్రచారాలతో హోరెత్తిన గ్రామాలు నేడు ఓట్ల పండుగకు ముస్తాబయ్యాయి. ఇందు కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు వేళయ్యింది. జిల్లాలోని 13 మండలాల్లో ఇన్నాళ్లూ ప్రచారాలతో హోరెత్తిన గ్రామాలు నేడు ఓట్ల పండుగకు ముస్తాబయ్యాయి. ఇందు కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

అనంతపురం పాలిటెక్నిక్‌ కాలేజీలో పంపిణీ కేంద్రం వద్ద పోలింగ్‌ సామగ్రిని సరిచూసుకుంటున్న ఉద్యోగులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత సమరానికి సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం రూరల్‌, రాప్తాడు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌, గుమ్మఘట్ట మండలాల పరిధిలోని 218 సర్పంచ్‌ స్థానాలు, 2,318 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో 8 సర్పంచ్‌ స్థానాలు, 482 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 210 సర్పంచ్‌ స్థానాలకు, 1,836 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సర్పంచ్‌ స్థానాలకు 539 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3,786 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహించారు. మూడు రోజులపాటు రేయింబవళ్లు గ్రామాల్లో తిరుగుతూ అన్ని వర్గాల ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వలస వెళ్లిన ఓటర్లను, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులను పోలింగ్‌కు రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ప్రయత్నాలు చేశారు. నేటి ‘పల్లె పోరు’లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

పటిష్ట పోలీసు బందోబస్తు

కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌, కౌంటింగ్‌ సమయంలో అలజడులు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఎన్నికల కమిషన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

నిర్భయంగా ఓటు వేయండి

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ తెలిపారు. కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో గురువారం పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 218 సర్పంచ్‌ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా, 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 210 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 2,388 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రిని పంపిణీ కేంద్రాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించామని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement