న్యూస్‌రీల్
కళ్యాణదుర్గం: ఇటీవల జరిగిన జిల్లా – మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల అక్రమాలపై మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయావకాశాలు ఉన్న నాలుగు జెడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన అల్లుళ్లతో పాటు 80 మంది ప్రైవేట్ బౌన్సర్లు చొరబడి గెలుపోటములను తారుమారు చేశారని ఆరోపించారు. బాధ్యులైన ఎన్నికల సిబ్బంది, అధికారులపై కూడా పిటిషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. అధికార యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అక్రమంగా గెలిచిన వారి ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
ప్రపంచ మేయర్ల సదస్సులో కమిషనర్ మల్లికార్జున
హిందూపురం టౌన్: ముంబైలో నిర్వహిస్తున్న 3వ ‘ప్రపంచ మేయర్ల సదస్సు–2026’లో హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పాల్గొన్నారు. స్థానిక స్వపరిపాలనపై పనిచేస్తున్న అఖిల భారత సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 25 నుంచి 27 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. పట్టణ పరిపాలన, అభివృద్ధి, మెరుగైన పాలనపై దేశ, విదేశాల ప్రతినిధులు చర్చించనున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి హిందూపురం మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.


