తాడిపత్రిటౌన్: పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ అదే అరాచకం కొనసాగిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అండతో ఆ పార్టీ నాయకులు ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడక్కడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేసినా.. పరిశీలన సమయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ నామినేషన్లను తిరస్కరించేలా చేశారు. అలా తాడిపత్రి నియోజకవర్గంలోని అత్యధిక పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులను ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అయినా అధికార పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాం అన్నట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో టీడీపీ నాయకుల అరాచకాల కారణంగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇక యాడికి మండలంలోని ఐదు పంచాయతీలు, పెద్దవడుగూరు మండలంలోని నాలుగు పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో నిలిచారు.
పోటీ లేకుండా చేశారిలా..
తాడిపత్రిలో ఈ నెల 20న జరిగిన అల్లర్ల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపారు. దీంతో తమను కూడా అక్రమ కేసుల్లో ఇరికిస్తారనే భయంతో తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలకు చెందిన నాయకులు, మద్దతుదారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాడిపత్రి మండలం దిగువపల్లి, ఉస్సేనాపురం పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయగలిగారు. అయితే వాటిని కూడా అధికారులు పరిశీలనలో తిరస్కరించడం ద్వారా తాడిపత్రి మండలంలో టీడీపీ మద్దతుదారుల ఏకగ్రీవానికి మార్గం సుగమం చేసినట్లయ్యింది.
●పెద్దపప్పూరు మండలంలో ఉన్న 20 పంచాయతీలకు గాను 8 పంచాయతీల్లో (వరదాయపల్లి, గార్లదిన్నె, చిక్కేపల్లి, చిన్న ఎక్కలూరు, పెద్ద ఎక్కలూరు, పసలూరు, నరసాపురం, చాగల్లు) సర్పంచ్ స్థానాలకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలనలో తిరస్కరించారు. ఇక్కడ కూడా టీడీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అధికారులు సహకరించారు.
●యాడికి మండలంలో 14 పంచాయతీలకు గాను 10 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేశారు. పరిశీలనలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. చిక్కేపల్లి, నిట్టూరు, వేములపాడు, పుప్పాల, కోనుప్పలపాడు పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోటీల్లో ఉన్నారు.
● పెద్దవడుగూరు మండలంలో 25 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఐదు పంచాయతీల్లో నామినేషన్లు వేయగలిగారు. అందులో రావులుడికి సర్పంచ్ నామినేషన్‌ను అధికారులు చిన్న చిన్న తప్పులను సాకు చూపుతూ తిరస్కరించారు. నాలుగు పంచాయతీ (తిమ్మాపురం, క్రిష్టిపాడు, లక్ష్ముంపల్లి, గుత్తి అనంతపురం) సర్పంచ్ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో నిలిచారు.
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
అనంతపురం: శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు, పుట్లూరు మండలాల్లో టీడీపీ నేతలు బలవంతంగా పంచాయతీలను ఏకగ్రీవాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ వేసినప్పటి నుంచి విత్‌డ్రా వరకు ఒత్తిళ్లు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగేందుకు కూడా ఇష్టపడని టీడీపీ నేతలు అన్నీ ఏకగ్రీవాలే చేసుకునేందుకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు పోలీసులు ‘పచ్చ’ నేతలకు వత్తాసు పలికారు. ఇంకేముంది వైఎస్సార్‌సీపీ నేతలను సర్పంచ్ స్థానాలకు పోటీ చేయలేని పరిస్థితులు కల్పించారు. ఎవరైనా పోటీ చేస్తే ‘అంతుచూస్తాం’ అని బెదిరిస్తున్నారు. ఏజెంట్లను ఎలా కూర్చోబెడతారో చూస్తాం’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అలా యల్లనూరు మండలంలో 10, పుట్లూరు మండలంలో 10 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులతో ఏకగ్రీవం చేసుకున్నారు.
పంచాయతీ పోరులోనూ టీడీపీ అదే అరాచకం
ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులు, బెదిరింపులు
అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల తిరస్కరణ
తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో అన్ని పంచాయతీలూ ఏకగ్రీవం చేసుకున్న టీడీపీ మద్దతుదారులు
యాడికిలో ఐదు, పెద్దవడుగూరులో నాలుగు పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు


