బండారు తీరుపై భగ్గుమన్న ‘తమ్ముళ్లు’ | - | Sakshi
Sakshi News home page

బండారు తీరుపై భగ్గుమన్న ‘తమ్ముళ్లు’

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న బండారు శ్రావణి వ్యవహారశైలి నిత్యం వివాదాస్పదమవుతోంది. పదవిని అడ్డుపెట్టుకుని ఇసుక, మైనింగ్‌, మట్టి, రేషన్‌ బియ్యం, మద్యం దందా ఇలా నియోజకవర్గాన్ని గుళ్ల చేస్తున్నారని సొంత పార్టీ కేడరే వాపోతోంది. ప్రతీ పనిలో కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందేనని, పార్టీ పదవులకు కూడా డబ్బులు డిమాండ్‌ చేయడంపై కార్యకర్తలు ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీపీ పదవిని కూడా అమ్ముతున్నారని టీడీపీ కార్యకర్తలే తీవ్ర విమర్శలు చేసి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు ధర్నాకు కూర్చోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

పదవి ఆశ పెట్టి .. భారీగా ఖర్చు పెట్టించి..

శింగనమల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ మండల నాయకుడు ఈశ్వరరెడ్డి ఎంపీపీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పదవి మీదేనని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇచ్చిన హామీ మేరకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నారు. సోదనపల్లి నుంచి ఈశ్వరరెడ్డి కోడలు పేట వీర తులసి పోటీ చేశారు. పోలింగ్‌ రోజు భారీగా రిగ్గింగ్‌ చేయడంతో ఆమె గెలుపొందారు.

పదవి కావాలంటే రూ.20 లక్షలు ఇవ్వాల్సిందే...

ప్రతి పనికీ వాటాలకు అలవాటుపడిన ప్రజాప్రతినిధి ఎంపీపీ పదవిని బేరం పెట్టారు. రూ.20 లక్షలు ఇస్తేనే మీరు ఎంపీపీగా ఎన్నికవుతారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఈశ్వరరెడ్డి వర్గం అగ్గిలం మీద గుగ్గిలమైంది. ఎన్నికల సందర్భంగా ప్రతి ఎంపీటీసీకి రూ.లక్ష ఇచ్చామని తమ ఎన్నికకు రూ.20 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని గెలిస్తే మళ్లీ డబ్బులు డిమాండ్‌ చేయడంతో విరుచుకుపడ్డారు. అనంతపురంలోని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు గురువారం శింగనమల మండల టీడీపీ కార్యకర్తలంతా కూర్చుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేపై దండయాత్ర

డబ్బులు ఖర్చుపెట్టుకుని రిగ్గింగ్‌కు పాల్పడి ఎలాగోలా గెలిస్తే తీరా పదవి ఇవ్వకుండా ఎమ్మెల్యే శ్రావణి అడ్డుకోవడంపై సొంత పార్టీ కార్యకర్తలే అడ్డం తిరిగారు. ఎమ్మెల్యే నివాసానికి భారీగా చేరుకుని శాపనార్థాలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలియడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏడీసీసీబీ చైర్మన్‌ ముంటిమడుగు కేశవరెడ్డి అక్కడికి వచ్చి వారితో చర్చించారు. అయితే డబ్బు ఇవ్వకపోవడంతో తులసిని పక్కనపెట్టి రాచేపల్లి నుంచి గెలిచిన కె.హరితకు పదవిని అడ్డదారిలో కట్టబెట్టారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను నిర్బంధించి దొంగదారిలో పదవిని గెలవడంపై ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతతో పాటు ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎంపీ రంగయ్యను హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న అనంత, శైలజనాథ్‌

శింగనమల ఎంపీపీ స్థానాన్ని అమ్ముకున్నారంటూ టీడీపీ శ్రేణుల ఆగ్రహం

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ధర్నాకు దిగిన కార్యకర్తలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రావణి వ్యవహార శైలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement