అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. తొలిదశ ఎన్నికలు తుది అంకానికి చేరుకోగా.. రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఇదే సమయంలో మూడో దశ ఎన్నికలకు తెరలేవడంతో జిల్లా వ్యాప్తంగా పల్లె పోరు రసవత్తరంగా మారుతోంది. చివరిదశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.
172 పంచాయతీల్లో పోరు
మూడో దశలో ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్, పెద్దవడుగూరు, యాడికి, బెళుగుప్ప, కూడేరు, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లోని 172 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 172 సర్పంచ్ స్థానాలతో పాటు 1,708 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,784 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూడు రోజుల పాటు నామినేషన్లు
ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం కల్పించారు. 26న అప్పీళ్లపై అప్పీలేట్ అధికారి నిర్ణయం తీసుకుంటారు. 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
3.89 లక్షల మంది ఓటర్లు
మూడో దశ ఎన్నికల్లో మొత్తం 3,89,477 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1,93,061 మంది పురుషులు, 1,96,378 మంది మహిళలు, 38 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
అన్ని మండలాల్లోనూ ఎన్నికల సందడి
జిల్లాలోని మొత్తం 576 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. తాజాగా మూడో దశ నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా అంతటా ఎన్నికల సందడి నెలకొంది.
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
మూడో దశ ఎన్నికల నిర్వహణకు స్టేజ్–1, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు తెలిపారు.
172 పంచాయతీల్లో ఎన్నికల సమరం షురూ
21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
డిసెంబరు 2న పోలింగ్, అదే రోజు కౌంటింగ్


