కలెక్టర్‌ సారు.. కరుణించరూ! | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సారు.. కరుణించరూ!

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

అనంతపురం న్యూటౌన్‌: శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన బృహత్తర పథకం.. ప్రస్తుతం ఆ పథకంలో పనిచేసే నీటి సరఫరా కార్మికుల వేతన వెతలు పట్టించుకునేవారు లేరు.. పథకాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వందలాది మంది కార్మికులకు వేతనాలు అందక, పీఎఫ్‌ మొత్తం ఖాతాల్లో జమ కాక అల్లాడిపోతున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 900 గ్రామాలకు తాగునీరు అందించే శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో దాదాపు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి 10 నెలల వేతన బకాయి, 23 నెలల ఈపీఎఫ్‌ మొత్తం చెల్లించాలని, ఈఎస్‌ఐ వైద్య సదుపాయం కల్పించడం, కాంట్రాక్టర్ల వేతన కోతలు, బాండ్లపై సంతకాల సేకరణపై విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు తీసుకోవడం, పథకానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరుతున్నారు.

కార్మికుల వినతిపత్రాలు బుట్టదాఖలు..

పెండింగ్‌ వేతనాల బకాయి ఒకేసారి చెల్లించాలని, ప్రతి నెలా 5వతేదీలోపు వేతనాలు చెల్లించేలా శాశ్వత విధానం తీసుకురావాలని, కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని, తొలగింపులకు స్వస్తి పలకాలని, పథకం నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతులు ఇస్తున్నా బుట్టదాఖలవుతున్నాయని, రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన బృహత్తర పథకంలో పనిచేసే కార్మికుల ఆకలికేకలు పట్టవా? అని నిట్టూరుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పైప్‌ లైన్ల వెంట, మోటార్ల వద్ద, రిజర్వాయర్ల వద్ద చెమటోడ్చి పనిచేసే తమకు నెల చివరికి జీతం రాకపోతే పిల్లల ఆలనా పాలనా, ఇంట్లో సరుకులు ఎలా తేవాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే కావాలని కార్మికులను వేధిస్తున్నారా? అన్న సందేహాలు కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అమలులో వివిధ స్థాయిల్లో ప్రభుత్వం కాంట్రాక్టర్‌ వ్యవస్థను తెచ్చిందని, ట్రంక్‌ లైన్‌, గ్రామీణ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసే స్టేజ్‌–4 వ్యవస్థ కాంట్రాక్టర్ల చేతిలోకి మళ్లిందని కార్మికులు విమర్శిస్తున్నారు. దీంతో దోపిడీ దారులను తలపించేలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారన్నారు.

కరుణచూపని కలెక్టర్‌ సారు..

జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ 2025 సెప్టెంబర్‌ 13న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ఏడుసార్లు వినతిపత్రాలుఅందించి, సమస్యను విన్నవిస్తూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఇన్నిసార్లు ఏ కలెక్టర్‌నూ కలిసి విన్నవించి ఉండరేమోనని కార్మికలు ఆవేదన చెందుతున్నారు.

శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల ఆకలి కేకలు

ఆత్మహత్యలే శరణ్యమంటున్న వైనం

14 నెలల్లో ఏడుసార్లు విన్నవించినా స్పందన శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement