స్థానిక ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. అధికారం కోసం ఏకంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలపైనా దాడులకు తెగబడుతున్నారు. గురువారం జరిగిన శింగనమల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక దీనికి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. అధికారులు, పోలీసులు, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఏకమై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దౌర్జన్యం, దాడులు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను చేజిక్కించుకున్నారు.
శింగనమల: శింగనమల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌సీపీ 6, టీడీపీ 6 స్థానాలను కై వసం చేసుకున్నాయి. రెండు పార్టీలకు ఎంపీటీసీలు సమానంగా ఉన్నారు. సోదనపల్లి ఎంపీటీసీగా టీడీపీకి చెందిన పేట తులసి ఎన్నికయ్యారు. అంతకు ముందే ఆమెను స్వయంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఉన్నపళంగా తులసి కాకుండా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంత గ్రామ పంచాయతీ అయిన రాచేపల్లి ఎంపీటీసీ హరితను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ శ్రేణులు గురువారం అనంతపురంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద ధర్నా చేశారు. చివరకు ఎంపీటీసీ తులసి శింగనమలలో జరిగిన ఎంపీపీ ఎన్నికకు రాలేదు. కేవలం టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు.
పక్కా ప్లాన్ ప్రకారమే...
వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీ అభ్యర్థి బోయ తిరుపాలమ్మ, ఎంపీటీసీలు గవ్వల తిరుపాలు, వరికూటి శ్రీనివాసులు, సోమశేఖర్, తప్పెట ప్రమీల, చింతకుంట రజిత మధ్యాహ్నం 12 గంటల సమయంలో శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే సమావేశానికి వచ్చారు. వారు వచ్చినప్పటి నుంచి పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ఏకపక్షంగా హింసించడం మొదలుపెట్టారు. తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతూనే పోలీసులు, అధికారులే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలతో బేరసారాలాడారు. అయితే వారు ఎవరికీ లొంగలేదు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో అనంతపురం నుంచి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీలను తీసుకొని ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు నాలుగు కార్లలో వచ్చారు. వారిని నేరుగా పోలీసులే ఎంపీడీఓ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు గవ్వల తిరుపాలు, వరికూటి శ్రీనివాసులతో మద్దతు ఇవ్వాలంటూ డబ్బు ఆశ చూపారు. వారు లొంగకపోవడంతో ఇద్దరు ఎంపీటీసీలను గదిలో బంధించి, తాళం వేశారు. సమావేశం భవనంలోకి టీడీపీకి చెందిన ఐదు మంది ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీలు బోయ తిరుపాలమ్మ, తప్పెట ప్రమీల, చింతకుంట రజిత, సోమశేఖర్‌ను తీసుకెళ్లారు. మిగిలిన తమ ఇద్దరు ఎంపీటీసీలు ఎక్కడున్నారని వారు ప్రశ్నించారు. తమకు అన్యాయం చేస్తున్నారని మహిళా ఎంపీటీసీలు ప్రశ్నించడంతో మహిళా పోలీసులు వారిపై దాడి చేశారు. అయితే ఎంపీటీసీ సోమశేఖర్‌పై చొక్కను చింపి వేసి చేయిచేసుకున్నారు. సమావేశ భవనంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి దగ్గర ఉండి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడి చేయించారు. చివరకు ఎంపీడీఓ భాస్కర్ కూడా మహిళా ఎంపీటీసీలపై దాడికి పాల్పడ్డారు. ఆర్‌ఓ లలితమ్మ కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ కనబరిచారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా, లాఠీచార్జ్
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ , వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీలపై సమావేశ భవనంలో దాడులు చేస్తున్నారని, బయటకు పంపాలని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. చివరికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఐదుగురితోనే ఎంపీపీ ఎన్నిక
టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీల ఓట్లతోనే ఎంపీపీగా హరిత, వైస్ ఎంపీపీగా శ్రీదేవి ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలతో కలసి అనంతపురం ఉడాయించారు.
తండ్రి కోసం బాలుడి కన్నీళ్లు
కల్లుమడి ఎంపీటీసీ గవ్వల తిరుపాలు కుమారుడు పదేళ్ల సూర్యతేజ తన తండ్రిని చూపించాలని కన్నీరు పెట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. ‘మా నాన్నను కొడుతున్నారు.. కాపాడాలి’ అని బతిమలాడినా ఎంపీడీఓ కార్యాలయం వరకు కూడా పంపలేదు.
ఎంపీటీసీలకు గాయాలు
ఏకపక్షంగా ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీటీసీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ ధర్నా నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎంపీటీసీలు బోయ తిరుపాలమ్మ, తప్పెట ప్రమీల, చింతకుంట రజిత, సోమశేఖర్ బయటకు వచ్చారు. వారందరి చేతులకు, కాళ్లకు గాయాలు తగిలాయి. తనిఖీల పేరుతో తమను హింసించారని, ఇద్దరిని బయటే తనిఖీ పేరుతో మరొకగదికి తీసుకెళ్లారన్నారు. ఆర్‌ఓ లలితమ్మ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు పోలీస్‌లను పిలిపించి తమపై దాడి చేయించారన్నారు. కేవలం ఐదుగురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఏకపక్షంగా ఎన్నుకున్నారన్నారు.
మావారెక్కడ?
వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ఇద్దరు ఎంపీటీసీలు ఎక్కడున్నారో చెప్పాలంటూ మాజీ మంత్రి శైలజనాథ్, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. బలం లేక తమ ఎంపీటీసీలపై దౌర్జన్యం చేశారని, ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు. సీఐ రామయ్య ఏకపక్షంగా వ్యహరించారన్నారు. కిడ్నాప్ అయిన ఇద్దరు ఎంపీటీసీలు ఎక్కడున్నారో చెప్పాలన్నారు.
బంధించిన ఎంపీటీసీల విడుదల
కల్లుమడి ఎంపీటీసీ గవ్వల తిరుపాలు, వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ వరికూటి శ్రీనివాసులును ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ గదిలో బంధించారు. వైఎస్సార్‌సీపీ నేతల ధర్నాతో ఆఖరికి వారిద్దరినీ విడుదల చేశారు. వారు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పోలీసులు తనిఖీ పేరుతో గదిలో ఉంచారని, ఆ గదిలోకి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వచ్చారని, తమకు డబ్బు ఆశ చూపారని, తాము ఒప్పుకోమని తేల్చిచెప్పామన్నారు. తర్వాత సీఐ, ఎస్‌ఐలు, పోలీసులు డబ్బు ఆశ చూపినా తాము లొంగలేదన్నారు. తర్వాత గదిలోనే తమను బంధించి తాళం వేశారన్నారు.
సీఐకి వ్యతిరేకంగా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా
సీఐ రామయ్య తమకు అన్యాయం చేశారని , ఏకపక్షంగా వ్యవహరించారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ , వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. నిరసనగా స్థానిక పోలీసుస్టేషన్ దగ్గర ధర్నా చేశారు. తమ వారిపై దాడి చేయడమేకాకుండా, ఎవరినీ సమావేశ భవనంలోకి అనుమతించలేదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
విలేకరులకూ నో ఎంట్రీ
ఎంపీపీ ఎన్నికకు విలేకరులను అనుమతించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా పోలీసులు ఎంపీడీఓ కార్యాలయంలోకి పాత్రికేయులను వెళ్లనివ్వలేదు.
పచ్చనేతల అరాచకం
ఏకపక్షంగా శింగనమల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక
ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడి, నిర్బంధం
అధికార పార్టీకి కొమ్ముకాసిన అధికార గణం
నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ధర్నా, పోలీసుల లాఠీచార్జ్
బలం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించుకున్న వైనం


