కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండల పరిధిలోని కురాకులపల్లిలో బుధవారం అర్థరాత్రి గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబదూరు పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, కన్వీనర్ కోటాలో ప్రవేశం పొందని విద్యార్థినులు ఈనెల 22వ తేదీలోపు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే కన్వీనర్ కోటాలో ప్రవేశం పొందిన విద్యార్థినులు స్పాట్ అడ్మిషన్ కోరుకుంటే, ముందుగా తాము ప్రవేశం పొందిన కళాశాలలో అడ్మిషన్ రద్దు చేయించుకోవాలని పేర్కొన్నారు. అడ్మిషన్ కోసం విద్యార్థినులు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, ఇంటర్ మార్కుల మెమో, వృత్తి విద్యా కోర్సు విద్యార్థినులు ఇంటర్మీడియెట్ బ్రిడ్జి కోర్సు సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకొని కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించొచ్చని తెలిపారు. ప్రవేశం కోరుకునే విద్యార్థినులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రవేశం ఖరారైన విద్యార్థినులు కోర్సు మొదటి ఏడాది ఫీజును ఈనెల 26, 27 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
డీఎస్సీ–2026 అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్:డీఎస్సీ–2026 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన అర్హులైన బీసీ కులాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టీటీసీ, బీఎడ్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మార్కుల పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. దరఖాస్తు ఫారాలను కార్యాలయంలోనే పొందొచ్చని స్పష్టం చేశారు. డీఎస్సీ–2026లో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఆశయం ఉన్న జిల్లా బీసీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖుష్బూ కొఠారి కోరారు. వివరాలకు సెల్: 9704204905, 9550250770, 8309006875 లో సంప్రదించాలని తెలిపారు.
మహిళ హత్య కేసులో
నిందితుడు అరెస్ట్
బెళుగుప్ప: యలగలవంకకు చెందిన మాలక్క హత్య కేసులో నిందితుడు గొల్ల గోవిందును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గొల్ల గోవిందును గుండ్లపల్లి వద్ద రాయదుర్గం– కళ్యాణదుర్గం ప్రధాన రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉరవకొండ రూరల్ సీఐ ఈరన్న గురువారం వివరాలు వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం వెంకటేశులతో మాలక్కకు వివాహమైంది. అయితే భర్తను వదిలి ఒంటరిగా జీవిస్తోంది. మరిది గొల్ల గోవింద్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ యలగల వంకలోనే ఉంటోంది. వెంకటేశులు తన ఇంటిని రూ.4 లక్షలకు విక్రయించి, రూ.20 వేలు మాలక్కకు ఇచ్చాడన్న విషయం తెలుసుకున్న గోవింద్.. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గోవింద్ హత్య చేయాలని పతకం వేశాడు. బుధవారం ఉదయం మాలక్కను ద్విచక్ర వాహనంపై అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి రాళ్లతో తలపై బాది హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతన్ని అరెస్టు చేసి కళ్యాణదుర్గం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.


