అనంతపురం: అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ముమ్మాటికీ అనంతపురం ప్రజల విజయమని నూతన మేయర్‌గా ఎన్నికై న సి.రమేష్‌గౌడ్ అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను మేయర్‌గా గెలిపించిన నగర ప్రజలకు, అహోరాత్రులు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, వామపక్షాల నేతలకు, మేధావులకు ధన్యవాదాలు తెలిపారు. అధికార కూటమి శ్రేణులు అనేక కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా నిలబడి వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తల పోరాట పటిమ భవిష్యత్ ఎన్నికలకు స్ఫూర్తిదాయకమన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, తన విజయానికి కృషి చేసిన అనంత వెంకటరామిరెడ్డికి, పార్టీ నాయకులు, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం ప్రజల తీర్పును గౌరవిస్తూ నగర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత 15 రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య ఎన్నికలు జరిగాయని, సజావుగా జరిగి ఉంటే 80 శాతం పోలింగ్ నమోదయ్యేదని తెలిపారు. గూండాల భయాన్ని సైతం లెక్కచేయకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలింగ్ బూత్‌ల వద్ద ప్రాణాలకు తెగించి నిలబడ్డాయన్నారు. నగరంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తామని, పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లందరినీ కలుపుకుని నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు.
ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో అరాచకాలు, భూ దందాలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం.. నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతూ, దోపిడీదారులు, కబ్జాకోరుల నుంచి రక్షించే కాపలాదారులుగా ఉంటామన్నారు. అనంతపురం ఆత్మగౌరవానికి, అధికార కూటమి అహంకారానికి మధ్య సాగిన ఈ పోరులో ప్రజలు ప్రజాస్వామ్యానికే పట్టం కట్టారన్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరిగిన ప్రతి విషయాన్నీ ప్రజలు గమనించారన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే అన్ని చోట్లా అనంతపురం తరహా ఫలితాలే వచ్చేవని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ఏజెంట్లను అడ్డుకుని, అభ్యర్థులను బలవంతంగా విత్‌డ్రా చేయించినా వైఎస్సార్‌సీపీకి 16,400 ఓట్లు రావడం పార్టీ పట్ల ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. నేడు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్‌బాషా, మాజీ మేయర్ వసీం సలీం, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు చింతకుంట మధు, నాగార్జున రెడ్డి, రాధాకృష్ణ, అమర్‌నాథ్ రెడ్డి, కమల్‌భూషణ్, రామకృష్ణ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విజయానికి తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు
ప్రజల తీర్పును గౌరవిస్తూ నగరాభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలి
అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తాం
అనంతపురం నూతన మేయర్ రమేష్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత


