కరువుపై కాకి లెక్కలు | - | Sakshi
Sakshi News home page

కరువుపై కాకి లెక్కలు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఉద్యానశాఖ పనితీరు అధ్వానంగా తయారైంది. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పండ్లతోటల రైతులకు మేలు జరిగేలా చూడాల్సిన ఆ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉద్యాన తోటలు బ్రహ్మాండంగా ఉన్నాయి.. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారనే భ్రమల్లో తేలిపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయకుండా కాకి లెక్కలతో నివేదికలు తయారు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో కరువు పరిస్థితులు తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పెద్దవడుగూరు మినహా మిగతా అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించింది. ఈ క్రమంలో కరువు పరిస్థితులు ప్రత్యక్షంగా తెలుసుకుని కేంద్రం నుంచి సాయం అందించే నిమిత్తం ఈ నెల 2న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్‌ గొట్మారా నేతృత్వంలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం (కేంద్ర బృందం) అత్యున్నత స్థాయి కరువు బృందం జిల్లాలో పర్యటించింది. కరువు పరిస్థితులకు సంబంధించి స్థానిక కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌, సమీక్ష తర్వాత జిల్లాకు రూ.384.10 కోట్లు సాయం అందించాలని వివిధ శాఖలు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించాయి. ఇందులో ఉద్యానశాఖ అడిగింది కేవలం రూ.5.75 లక్షలు కావడం విశేషం. కేంద్రం నుంచి అంతో ఇంతో సాయం వచ్చే అవకాశం ఉన్నా కూడా ఉద్యానశాఖ అధికారులు నిధులు కోరకపోవడంపై విపక్షాలు, రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

నీళ్లు లేక నరికేస్తున్న దుస్థితి

ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు కురవాల్సిన వర్షంలో కేవలం 42 శాతమే కురిసింది. దీంతో దీంతో భూగర్భ జలమట్టం 16 మీటర్ల కనిష్టానికి పతనమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల లోతుకు క్షీణించాయి. దీంతో బోరుబావుల్లో నీళ్లు రావడం గగనమైంది. నీళ్లు అందక పండ్ల తోటలు ఎండిపోతుంటే పుట్లూరు, యల్లనూరు, శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల్లో రైతులు చీనీ చెట్లను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. పలువురు రైతులు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసి చెట్లకు తడి అందిస్తున్నారు. ఇలా ఉద్యాన రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నా.. ఉద్యానశాఖ అధికారులకు కనిపించకపోవడం విచిత్రంగా అనిపిస్తోంది.

వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉద్యాన శాఖ నివేదిక

కేంద్రానికి కేవలం రూ.5.75 లక్షల కరువు సాయం కోరిన ఆ శాఖ అధికారులు

జిల్లా అధికారుల తీరుతో పైసా రాని పరిస్థితి

వర్షాభావంతో చీనీ తోటలు తొలగిస్తున్న రైతులు

ట్యాంకర్లతో తోటలను కాపాడుకుంటున్నా పట్టని యంత్రాంగం

చంద్రబాబు సర్కారు, ఉద్యానశాఖ తీరుపై రైతుల ఆగ్రహం

1.21 లక్షల హెక్టార్లలో ఉద్యానం

రారష్ట్‌రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా ఈ ఏడాది 1,21,768 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. అందులో 81,669 హెక్టార్లలో పండ్ల తోటలు, 26,366 హెక్టార్లలో కూరగాయ పంటలు, 4,368 హెక్టార్లలో ఔషధ, సుగంధ ద్రవ్యాలు, 863 హెక్టార్లలో పూలతోటలు, మరో 1,200 హెక్టార్లలో తోట పంటలు సాగవుతున్నాయి. అయితే కరువు పరిస్థితుల కారణంగా చీనీ, మామిడి, అరటి, దానిమ్మ లాంటి తోటల పరిస్థితి దారుణంగా ఉంది. పండ్ల తోటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్న రైతులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కనీసం రైతుల దుస్థితిని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లి కనీసం రూ.80 నుంచి రూ.100 కోట్లు మేర నిధులు కోరాల్సిన ఉద్యానశాఖ అధికారులు ఆ విధంగా నివేదిక అందించకపోవడంపై రైతులు, రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర బృందానికి జిల్లా ఉద్యాన అధికారులు అందించిన నివేదిక ఆధారంగా కేంద్రం నుంచి పైసా సాయం అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రధానంగా కేంద్ర బృందానికి కేవలం రూ.5.75 లక్షలు అడగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement