అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తమ పార్టీ నాయకులు బయట తిరగకుండా గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే బుధవారం తనను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ నాయకులు శాసిస్తున్నారని, ఎన్నికల పేరుతో ఎంపికలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఈసీ స్పందించాలని ఆశిస్తున్నానని తెలిపారు. అధికార పార్టీల నాయకులు దౌర్జన్యాలు చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలు దేశంలో ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు. గురువారం జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.
తండ్రీకొడుకులపై
దుండగుల దాడి
గుత్తి: పట్టణంలోని జెడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన తండ్రీ కొడుకులు గంగరాజు, చరణ్‌లపై బుధవారం సుమారు పది మంది కట్టెలు, రాడ్లు, పైప్‌లతో విచక్షణారహితంగా దాడి చేశారు. గంగరాజు ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన కుమారుడు చరణ్‌పై కూడా దాడికి చేయడమే కాక చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. మూక దాడిలో గాయపడిన తండ్రీ కొడుకులను స్థానికులు, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారెవరు.. ఎందుకు దాడికి పాల్పడ్డారనే విషయాలు విచారణలో వెల్లడి కావాల్సివుంది.
గొర్రెల కాపరి మృతి
యల్లనూరు: మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామానికి చెందిన అంకాలమ్మ(40) అనే మహిళ గొర్రెపిల్లను కాపాడేందుకు వెళ్లి ఈత రాక నీటమునిగి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు గొర్రెలను రోజు మాదిరిగానే మేపుకునేందుకు వెళ్లిన అంకాలమ్మ, ఒక గొర్రెపిల్ల కాలువలోకి దూకడంతో ఆమె కాలువలోకి దిగింది. ఈత రాక లోతు ఎక్కువ ఉన్న నీటిలో మునిగిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. భర్త జయచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు వార్డుల్లో జనసేనకు డిపాజిట్లు గల్లంతు
గుంతకల్లుటౌన్: గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల్లో ఏడు వార్డుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే ఐదు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పట్టణంలో ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థుల్లో 15వ వార్డు అభ్యర్థి వై.పవిత్రికి కేవలం 41 ఓట్లు, 22వ వార్డు అభ్యర్థి నెట్టికంటయ్యకు 12 ఓట్లు, 24వ వార్డులో ఆదిలక్ష్మికి 9 ఓట్లు, 30వ వార్డులో వీరేష్‌కు 15 ఓట్లు, 39వ వార్డులో విజయ్‌కు 54 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆయా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు కూడా ఆ పార్టీ అధినాయకత్వం బీ–ఫాంలు అందజేయడంతో ఇద్దరు అభ్యర్థులు ప్రచారం చేయకుండా మిన్నకుండిపోయారు. కూటమి పొత్తు ధర్మానికి టీడీపీ నేతలు తూట్లు పొడిచారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. కాగా సాధారణంగా వార్డుల్లో పోలైన మొత్తం చెల్లుబాటైన ఓట్లల్లో కనీసం 1/6 వంతు ఓట్లు సాధించకుంటే అభ్యర్థి డిపాజిట్ చేసిన సొమ్మును ఎన్నికల అధికారులు వెనక్కివ్వరు.


