అనంతపురం న్యూ టౌన్: జిల్లా పరిషత్ – మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. గురువారం 28 జెడ్పీటీసీ స్థానాలకు, 353 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందు కోసం 1,463 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 12,44,920 మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఇందులో 6,17,725 మంది పురుషులు, 6,27,080 మంది మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు.
జిల్లాలో కీలకంగా మారిన బీసీ ఓటర్లు
ప్రాదేశిక ఎన్నికల్లో బీసీ ఓటర్లు కీలకంగా మారారు. అభ్యర్థుల భవితవ్యం వారి ఓట్లపైనే ఆధారపడి ఉంది. జిల్లా పరిధిలో 8 లక్షల మందికి పైగా బీసీ ఓటర్లున్నారు. వీరిలో 3,97,406 మంది పురుషులు, 4,04,927 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించండి
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి నేతల ఆగడాలు పెరిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొనే పరిస్థితులను కల్పించాలని వైఎస్సార్‌సీపీ నేతలు అధికారులను కోరుతున్నారు.
ఓటేయాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోలతో కూడిన పెన్షన్ పత్రాలు, మాజీ సైనికుడి పెన్షన్ పుస్తకాలు, ఫొటోలతో కూడిన ఆస్తి పత్రాలు (పట్టాదారు పాస్ పుస్తకం, రిజిస్టర్ డీడ్ మొదలగునవి), ప్రభుత్వం, ఆప్కాబ్ బ్యాంకులు జారీ చేసిన పాసుబుక్కులు, కిసాన్ పాస్ బుక్కులు, బ్యాంకులు జారీ చేసిన ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు, ఫొటోతో కూడిన రేషన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్.పి.ఆర్ పథకం కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డులు, వీబీజీ రామ్ జీ (ఉపాధి హామీ పథకం) జాబ్‌కార్డు, అధీకృత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్లు, ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు, ఫొటోతో కూడిన శారీరక వైకల్య ధ్రువీకరణ పత్రం, బార్ కౌన్సిల్ జారీ చేసిన సభ్యత్వ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఫొటోలతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్ట్ కార్డులు, శాసనసభ, శాసనమండలి సచివాలయం ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీచేసిన ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులు, లోకసభ, రాజ్యసభ సచివాలయం ద్వారా పార్లమెంటు సభ్యులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని వెంట తెచ్చుకోవాలని సూచించారు.
పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
శింగనమల/గార్లదిన్నె: శింగనమల, గార్లదిన్నె మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పరిశీలకులు స్మరణ్‌రాజు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. అధికారులతో సమీక్షించి పోలింగ్ సిబ్బంది, కేటాయింపుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులకు సూచనలు చేశారు.
ఉరవకొండ/ కూడేరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. బుధవారం ఉరవకొండ, వజ్రకరూరు, కూడేరు మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లోటుపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్ నిర్ణీత సమాయానికి ప్రారంభం అవుతుందని, ఓటరు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సాలురెడ్డి, రవిప్రసాద్, సాజిదా బేగం, తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
28 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు


