అనంతపురం: చంద్రబాబు సారథ్యంలోని కూటమి రెండున్నరేళ్ల దుర్మార్గపు పాలనపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. అధికార పార్టీ నేతలు ఇంత కాలం సాగించిన దోపిడీలు, అరాచకాలకు చెక్ పెట్టేలా అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ మద్దతు అభివృద్ధి, సంక్షేమానికే అంటూ తుది ఫలితాల ద్వారా వెల్లడించారు. నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈయన దురాగతాలపై సొంత పార్టీ టీడీపీలోని వారే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కార్‌లో కనీస చలనం లేకుండా పోయింది. ఇదే అదనుగా ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయి చివరకు ప్రభుత్వ అధికారులను సైతం బెదిరించే స్థాయికి ఎదిగారు. అందరినీ బ్లాక్‌మెయిల్ చేస్తూ తన పబ్బం గడుపుకుంటుండడంతో ప్రజలు ఆయన్ను అసహ్యించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్న టీడీపీ అధిష్టానం నగర మేయర్ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే సాహసం చేయలేకపోయింది.
పొత్తులో బీజేపీకి అంటగట్టి..
అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలవలేమని స్పష్టంగా గుర్తించిన టీడీపీ అధిష్టానం.. పొత్తులో భాగంగా బీజేపీకి మేయర్ సీటును కేటాయించి.. ఓటమిని అంటగట్టేందుకు సిద్దమైంది. జిల్లాలో తొలి బోణీ చేయాలని భావించిన బీజేపీ అధిష్టానం సైతం బలాబలాలను బేరీజు వేసుకోకుండా బరిలో దిగింది. అయితే అభ్యర్థి ఎంపికలో పారదర్శకతకు తిలోదకాలిస్తూ మంత్రి సత్యకుమార్ అంతా తానై పావులు కదుపుతూ వచ్చారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా రంగంలో దించి, అతని గెలుపే లక్ష్యంగా దౌర్జన్యాలకు తెరలేపారు.
రాష్ట్ర వ్యాప్తంగా చర్చ
అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలను మంత్రి సత్యకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ ఇటువైపు పడింది. ఇతర చోట్ల కూటమి ఆధిక్యం కొనసాగినప్పటికీ ‘అనంత’ ఫలితాలపై మాత్రం రాజకీయంగా ప్రత్యేక చర్చకు దారితీసింది. చివరకు అందరూ ఊహించినట్లుగానే మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ 62,219 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థిపై 5,981 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 56,238 ఓట్లు వచ్చాయి.
అధికార కూటమికి ఓటరు హెచ్చరిక
మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించాయి. రాష్ట్రస్థాయి నాయకులు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినా మేయర్ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పట్టం కట్టడం కూటమి రాజకీయ వ్యూహాలకు ఎదురుదెబ్బగా మారింది. గురువారం జరిగే జిల్లా పరిషత్ – మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు అనంతపురం గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. దాదాపు రెండున్నరేళ్ల పాటు కూటమి నేతల దౌర్జన్యాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ప్రజలు తాము ఎదురు చూసిన సమయం రానే వచ్చిందని, ఓటు అనే అస్త్రంతో అవినీతిపరులు, దౌర్జన్యపరులకు చెక్ పెడతామని అంటున్నారు. పారదర్శక పాలన, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సాగు–తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రెయినేజీ వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వారికి ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చేశారు.
సత్యకుమార్‌కు భంగపాటు
ఏపీ రాజకీయంలో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం, మంత్రి సత్యకుమార్ యాదవ్ చుట్టూ తిరిగే పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ, బీజేపీ ఓటమి పాలైంది. ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగతంగా భుజాన వేసుకుని ముందుండి నడిపించిన మంత్రి సత్యకుమార్, తుది ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆయన రాజకీయ ప్రతిష్టకు పెద్ద గండి పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
అనంతపురంలో కూటమికి వాత పెట్టిన ఓటర్లు
ఓటు రూపంలో ప్రతిబింబించిన పాలకులపై ప్రజాగ్రహం


