అనంతపురం ఎడ్యుకేషన్/కళ్యాణదుర్గం రూరల్: ఎన్నికల విధుల పేరుతో సచివాలయ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు రాత్రి హడావుడిగా ‘ఎన్నికల విధుల’ ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. పోలింగ్ జరిగే ప్రతి కేంద్రంలో క్యూలైన్ నిర్వహణ కోసం ఒక్కో సచివాలయ ఉద్యోగిని నియమిస్తూ అనంతపురం రూరల్ ఎంపీడీఓ దివాకర్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకే కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ పోలింగ్‌కు ముందు రోజు సాయంత్రం వాట్సాప్ గ్రూపుల్లో విధుల ఉత్తర్వులు పంపారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నారనే ఉద్దేశంతోనే తమపై ఇలా కక్ష కట్టి వ్యవహరిస్తున్నారనే అనుమానాలను కొందరు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది సేవలు అవసరమే అయినప్పటికీ, విధుల కేటాయింపులో ముందస్తు సమాచారం ఇవ్వడం, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అధికారుల బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.


