సాహస లక్ష్మి..సమయస్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

సాహస లక్ష్మి..సమయస్ఫూర్తి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

ఇప్పటికీ కళ్లముందే భయానక ఘటన

అనంతపురం ఎడ్యుకేషన్‌: అదో విద్యాలయం.. ఉదయం పది గంటల సమయం.. తరగతి గది అంతా నిశ్శబ్దం.. ఉపాధ్యాయిని పాఠం బోధిస్తోంది.. విద్యార్థినులంతా చక్కగా వింటుంటే.. అంతలోనే నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా అలజడి... అందరూ ఉలిక్కి పడి వెనక్కి చూశారు.. కరెంటు రంపంతో తలుపును కోస్తున్నట్లు కనిపించింది.. విషయాన్ని తేలికగా తీసుకున్న విద్యార్థులు..యధావిధిగా పాఠంలో పడిపోయారు.. ఉన్నపళంగా ఒక్క ఉదుటన ఉన్మాది బాలికల వైపు దూసుకొచ్చాడు.. ఓ విద్యార్థినిపై దాడికి తెగబడ్డాడు.. ఏమైందో..ఏం జరుగుతోందో.. తేరుకునేలోపే రక్తం ధారల్లా చిమ్ముతోంది.. గది అంతా హాహాకారాలు.. ఆర్తనాదాలు.. అంతలోనే సాహసలక్ష్మిగా వీరోచితంగా తిరగబడింది.. తోటి స్నేహితురాలిపై ఉన్మాది దాడిని ప్రతిఘటించింది.. అడ్డుకోయిన ఆమైపెనా దాడికి తెగబడ్డాడు.. రక్తపుమడుగులో నిస్సహాయంగా పడి ఉన్న బాలికను చూసి.. ఉన్మాది అక్కడి నుంచి ఉడాయించాడు.. ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో జరిగిన ఈ ఘాతుకం.. దావానంలా వ్యాపించింది.. భయానికి తలవంచని బాలిక తెగువ.. మానవత్వం, ఆమె సాహసాన్ని ఎందరో ప్రశంసిస్తున్నారు. చదువుల తల్లి..భీతిల్లేలా జరిగిన భయానక ఘటన నేటికీ వెంటాడుతోంది.

ఇద్దరిదీ విడదీయలేని స్నేహం

రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతుల కుమార్తె గోపిక, రాప్తాడు నాగరాజు, రమాదేవి దంపతుల కుమార్తె లక్ష్మి ఇద్దరూ ఆరోతరగతి నుంచి స్నేహంగా మెలుగుతున్నారు. పాఠశాలలోనూ పక్కపక్కనే కూర్చునేవారు. ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. ఇద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. అందుకే కళ్ల ముందే ప్రాణస్నేహితురాలిపై దాడి జరుగుతుంటే లక్ష్మీ తట్టుకోలేకపోయింది.

ప్రాణభయంతో పరుగులు..

ఉన్మాది తరగతి గదిలోకి ఎలక్ట్రిక్‌ రంపంతో చొరబడి తలుపును కట్‌ చేసిన అనంతరం నేరుగా గోపిక వద్దకు వెళ్లి ఆమె మెడపై దాడి చేశాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో తరగతి గదిలోని విద్యార్థినులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయిని కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, స్నేహితురాలు లక్ష్మి మాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్మాది దాడిని అడ్డుకుంది. స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటంతో దుండగుడి దాడిని అడ్డుకునేందుకు వీరోచితంగా యత్నించింది.

స్నేహితురాలిని కాపాడబోయి..

తన దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన లక్ష్మిపై కూడా ఆగ్రహంతో ఉన్మాది రంపంతో దాడి చేశాడు. దీంతో ఆమె కూడా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణభయంతో ఎవరూ సాహసం చేసి ముందుకు వెళ్లలేని ఘటన.. అయినా ఆ బాలిక వెనక్కి తగ్గకుండా తన స్నేహితురాలి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకేమవుతుందోనన్న ఆలోచన కంటే స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న తపనే ఆ సమయంలో లక్ష్మిలో కనిపించింది.

స్నేహానికి నిదర్శనం.. సమాజానికి స్ఫూర్తి

సాధారణంగా ప్రమాదం ఎదురైనప్పుడు ప్రాణభయంతో మనుషులు తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది ఓ పాఠశాలలో కళ్ల ముందే స్నేహితురాలిపై రంపంతో దాడి జరుగుతుంటే అందరూ భయంతో పరుగులు తీసిన వేళ.. లక్ష్మీ మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకునేందుకు యత్నిం చింది. ఆమె చేసింది సాహసం మాత్రమే కాదు.. స్నేహానికి, ఆత్మీయతకు, తోటి బాలిక పట్ల బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం.

తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన సందర్భాన్ని లక్ష్మీ గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ‘ నా కళ్ల ముందే నా స్నేహితురాలిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేస్తుంటే చూడలేకపోయాను.. నాకు ఏమవుతుందో కూడా ఆలోచించకుండా తెగించి అడ్డుకోబోయా. బైక్‌పై వచ్చిన ఉన్మాది.. ఎలక్ట్రిక్‌ రంపాన్ని పాఠశాల ఆవరణలోనే ఆన్‌ చేసుకొని లోపలికి చొరబడ్డాడు. వచ్చీరాగానే తరగతి గది తలుపును కట్‌ చేశాడు. ఏదైనా పని చేస్తారేమోనని మొదట అందరం చూస్తుండిపోయాం. కానీ నేరుగా మా వద్దకు వచ్చి గోపిక మెడపై రంపం పెట్టాడు. భయంతో మా స్నేహితులంతా బయటకు పరుగులు తీశారు. నేను ఆ దృశ్యాన్ని చూడలేక, నా స్నేహితురాలిని పక్కకు నెట్టే ప్రయత్నం చేశా. దీంతో నా పైనా దాడి చేశాడు. ఆ సమయంలో నాకు భయం అనిపించలేదు. కానీ ఇప్పుడు తలచుకుంటేనే భయమేస్తోంది. ఇప్పటికీ నా కళ్ల ముందు ఘటనే కదలాడుతోంది. పాపం.. నాఫ్రెండ్‌.. ఆ బాధను ఎలా భరించిందో..అంటూ కన్నీటి పర్యంతమవుతోంది.

స్నేహితురాలి ప్రాణాలు కాపాడేందుకు ఉన్మాదిపై తిరగబడిన బాలిక

రక్తం చిందుతున్నా వీరోచితంగా ప్రతిఘటన

లక్ష్మిని వెంటాడుతున్న భయానక జ్ఞాపకం

బాలిక ధైర్యసాహసాలకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement