ప్రచార రథంపై ‘పచ్చ’ మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రచార రథంపై ‘పచ్చ’ మూకల దాడి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

యల్లనూరు : వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై ‘పచ్చ’ మూకలు దాడికి తెగబడ్డాయి. దాడిలో డ్రైవర్‌, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచార రథం పుట్లూరు మండల వ్యాప్తంగా తిరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం బాలాపురం సమీపంలో వస్తున్న ప్రచార రథాన్ని టీడీపీ అల్లరి మూకలు అడ్డుకున్నారు. అందులో ఉన్న డ్రైవర్‌ ఆదినారాయణ, వైఎస్సార్‌సీపీ కార్యకర్త మిద్దె ఆదినారాయణపై కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఫ్లెక్సీలు చించేసి.. రూ.25వేలు విలువ చేసే మైక్‌ సిస్టంను ధ్వంసం చేశారు. ఇకపై ప్రచార వాహనాన్ని ఎలా తిప్పుతారో చూస్తాం అంటూ హెచ్చరించారని డ్రైవర్‌ తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఇలా దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మహేశ్వరరెడ్డి ఆరోపించారు. దాడి ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాయలచెరువులో దుశ్చర్య

యాడికి: రాయలచెరువు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరూరు రహదారిలోని నంబర్‌ 1 ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం, యాడికి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మాదాల రామకృష్ణ పరమ హంస గృహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గాజు సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం వద్ద తలుపు ధ్వంసమయ్యింది. యాడికిలోని బుగ్గ రోడ్డులో నివసిస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు మక్కల అరుణ తన ఇంటి వద్ద ఉన్న శ్రీరామ హార్డ్‌వేర్‌, శ్రీరామ వాటర్‌ ప్లాంట్‌లో ఉన్న సీసీ కెమెరాలు, వాటర్‌ క్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీ ద్వంసం చేయటమే కాకుండా షాపులో ఉన్న రూ.2 లక్షల నగదును కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement