బెళుగుప్ప: నలుగురు మిత్రులు.. కూలికెళ్లి కుటుంబాలకు చేదోడుగా ఉంటున్నారు.. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్వెళ్లి కూలిపనులు చేస్తూ అప్పుడప్పుడు ఇళ్లకు తిరిగొచ్చేవారు.. ఆదివారం మున్సిపల్ ఎన్నికలున్నాయని ఓటు వేసేందుకు సొంతూరు వచ్చారు.. అందరూ యధావిధిగా కూలిపనులకోసం కారులో తిరిగి బయల్దేరారు. అర్ధరాత్రి సమయంలో తీరా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురిలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈఘటన మండలంలోని నరసాపురం వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. రాయదుర్గానికి చెందిన ఎన్.వెంకటేశులు (25), మహేంద్ర, మంజునాథ, నాగరాజు కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్కు వలస కూలీలుగా వెళ్లారు. అప్పుడప్పుడు సొంతూరు వచ్చి వెళ్తుండేవారు. ఆదివారం రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కారులో వచ్చారు. ఓటు వేసి తిరిగి వెళ్తుండగా అర్ధరాత్రి సమయంలో బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. వెంకటేశులు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముక్కునుంచి రక్తస్రావమైంది. మంజునాథ, నాగరాజుతోపాటు కారు నడుపుతున్న మహేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు..వెంకటేశులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు.
చేతికి ఎదిగొచ్చిన కొడుకు.. ఇంటికి చేదోడుగా ఉంటాడనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో వెంకటేశులు తల్లిదండ్రులు సిద్ధక్క, బొమ్మయ్యలు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. మృతుడి తల్లి సిద్ధక్క ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు.
పారితోషికం ఇవ్వకుండా మొండిచేయి
అనంతపురం అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులతో పనిచేయించుకున్నారు..పారితోషికం ఇవ్వకుండా మొండిచేయి చూపారని అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించడం లేదని అధికారులు చెప్తూ వచ్చారని, శనివారం సాయంత్రం చివరి క్షణంలో విధులు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా కేటాయించిన కేంద్రాల్లో తక్షణం రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారన్నారు. రాయదుర్గం తదితర సుదూర ప్రాంతాల ఉద్యోగులకు అనంతపురం కార్పొరేషన్లో విధులు కేటాయించాన్నారు. అదే విధంగా ఇక్కడి ఉద్యోగులకు ఇతర మునిపాలిటీల్లో విధులకు కేటాయించారన్నారు. దీంతో సొంత ఖర్చులతో కేటాయించిన కేంద్రాలకు చేరుకుని రాత్రికి అక్కడే బసచేశామన్నారు. పోలింగ్ విధులు ముగిసిన తర్వాత పారితోషికం ఇచ్చేది లేదని చెప్పడం సరికాదని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్ఓలు కూడా పారితోషికం తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తారా? అని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పారితోషికం విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు.


