రాప్తాడు ఘటనతో కలకలం | - | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఘటనతో కలకలం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌/అనంతపురం సిటీ: పాఠాలు చెప్పే తరగతి గది.. విద్యార్థుల కేరింతలతో కళకళలాడాల్సిన పాఠశాల ప్రాంగణం.. ఒక్కసారిగా భయానక దృశ్యాలకు వేదికై ంది. పదో తరగతి విద్యార్థిని గోపికపై విద్యుత్‌ రంపంతో దాడి చేసిన డుంబు అలియాస్‌ హేమంత్‌.. ఆమె కిందపడిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వాకిలి వద్దకు వెళ్లి వెనక్కి చూడగా గోపిక లేచి కూర్చున్నట్లు గుర్తించాడు. అంతే.. మళ్లీ వెనక్కి వచ్చి ఆమైపె విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మీని కూడా వదల్లేదు. రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కాగా నిందితుడు మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రేమ పేరుతో వేధింపులే కారణమా?

ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన హేమంత్‌ తల్లిదండ్రులు చనిపోవడంతో అయ్యవారిపల్లిలోని తన సోదరి వద్ద ఉంటూ టమాట మండీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతులకు కుమార్తె గోపికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఆమె నిరాకరించడంతో ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వచ్చే ముందు మద్యం సేవించినట్లు తెలిసింది.

సీసీ కెమెరాలే కీలకం...

ఘటన అనంతరం పోలీసులు పాఠశాలలోని సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాఠశాలలోకి వచ్చిన సమయం, అక్కడ ఉన్న వ్యవధి, బయటకు వెళ్లిన మార్గాన్ని పరిశీలించారు. ధర్మవరం వైపు వెళ్లినట్లు గుర్తించి రైల్వేగేటు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పిల్లలను బడికి ఎలా పంపాలి?

ఆస్పత్రి వద్దకు చేరుకున్న గోపిక, లక్ష్మీ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది, వాచ్‌మన్‌ ఉన్న పాఠశాలలోకి ఒక వ్యక్తి విద్యుత్‌ రంపంతో ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. తమ పిల్లల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ‘మాకు కేసులు వద్దు.. వాడిని అప్పగించండి. పాఠశాలలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపైనా చర్యలు తీసుకోవాలి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

నిందితుడిని మాకప్పగించండి

ప్రేమోన్మోది హేమంత్‌పై తాము పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయబోమని, నిందితుడిని తమకు అప్పగిస్తే మిగిలిన పని తామే చేసుకుపోతామని బాధితురాలి బంధువులు ఆగ్రహంతో వ్యక్తం చేశారు. గంజాయికి అలవాటుపడిన హేమంత్‌ జులాయిగా మారి పలుమార్లు తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తూ వచ్చాడని, ఈ విషయాన్ని గతంలో తాము పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదన్నారు. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.

ప్రముఖుల రాకతో ఉద్రికత్తతో

రాప్తాడు ఘటనలో గాయపడిన బాలికలను పరామర్శించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు తరలిరావడంతో సర్వజనాస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం వెన్నపూస రవీంద్రారెడ్డి, ప్రసన్నాయపల్లి మహనందరెడ్డి, ఐద్వా సావిత్రి తదితరులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడి పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి గోపిక తల్లితో మాట్లాడించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ శనివారం సాయంత్రం తీరిగ్గా ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

గాయపడిన బాలికను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

రోదిస్తున్న బాధితురాలి బంధువులు

జీజీహెచ్‌లో హాహాకారాలు

ఏం జరుగుతుందో అర్థం కాలేదు

రంపం మిషన్‌తో తరగతి గదిలోకి వచ్చిన వ్యక్తిని తొలుత పనిమీద వచ్చిన వాడిగా భావించాను. విద్యార్థులు కేకలు వేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. గోపికపై దాడి జరిగిన దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాను.

– రాజేశ్వరి, టీచర్‌

బాలికల ప్రాణాలకు రక్షణ ఏదీ?

చదువుల దేవాలయాలైన పాఠశాలల్లోనే విద్యార్థుల మానప్రాణాలకు రక్షణ లేకపోతే ఇక ఎక్కడ భద్రత ఉంటుంది? గోపికపై జరిగిన దాడి అత్యంత బాధాకరం. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బాలికపై ఇంతటి దారుణం జరగడం బాధాకరం. ఇప్పటికై నా రాప్తాడులో శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలి.

– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి,

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన పాశవిక దాడిపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకాయి. శనివారం ఉదయం ఘటన జరిగిన వెంటనే గోపికతో పాటు గాయపడిన మరో బాలిక లక్ష్మిని ఆటోలో స్థానికులు జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆయా బాలికల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున్న జీజీహెచ్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. అదే సమయంలో పోలీసులు సైతం భారీగా సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మికి ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు సత్వర చికిత్స అందించగా... తీవ్రంగా గాయపడిన గోపికను ఆగమేఘాలపై ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేశారు.

మూడు గంటల శస్త్ర చికిత్స...

బెంగళూరు తరలింపు

ఉన్మాది దాడిలో గాయపడిన గోపికకు శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ముఖంపై లోతైన గాయం కావడంతో సగ భాగం పూర్తిగా చెక్కేసినట్లయింది. ఎడమ చేతి ఎముక భాగం విరిగింది. ఛాతీపైనా లోతైన గాయమైంది. శరీర ముందు భాగంలో చాలా చోట్ల రంపపు గాట్లు పడ్డాయి. అలాగే వీపుపై కూడా లోతైన గాయాలు ఉన్నాయి. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా వైద్యులు శ్రమించి బాలికకు శస్త్రచికిత్స చేశారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో శనివారం సాయంత్రం అనంతపురం నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో గోపికను బెంగళూరుకు తరలించారు.

సాహస బాలిక లక్ష్మి

గోపికపై హేమంత్‌ దాడి చేస్తున్న సమయంలో సహ విద్యార్థిని లక్ష్మి ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిసింది. తరగతి గదిలోని వారంతా పరుగులు తీస్తుండగా లక్ష్మి ఒక్కతే ప్రాణాలకు తెగించి హేమంత్‌ను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు తోపులాట జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే హేమంత్‌ చేతిలోని ఎలక్ట్రిక్‌ రంపం జారి లక్ష్మి రెండు మెకాళ్ల నుంచి పాదాల వరకూ బలమైన గాయాలయ్యాయి. లక్ష్మి ధైర్యంగా పోరాడడం వల్ల గోపిక ప్రాణాలతో ఆస్పత్రికి చేరుకోగలిగిందని, లేకపోతే తరగతి గదిలోనే ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేదని పలువురు చెబుతున్నారు.

మద్యం మత్తులోనే గోపికపై దాడి చేసిన నిందితుడు హేమంత్‌ !

ఇలాగైతే పిల్లలను ప్రభుత్వ బడులకు ఎలా పంపాలంటున్న తల్లిదండ్రులు

దిగ్భ్రాంతికి గురయ్యానంటున్న ఉపాధ్యాయురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement