వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

శెట్టూరు: మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు ముత్యాలుపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. మండల పరిధిలోని కంబాలపల్లిలో జరిగిన హత్యాయత్నం కేసులో ఆయన ప్రమేయం లేకపోయినా టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసు పెట్టడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

అసలేం జరిగిందంటే...

శెట్టూరు మండలం కంబాలపల్లికి చెందిన విరుపాక్షి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో విరుపాక్షి గాయపడ్డాడు. అతను కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇదే విషయంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మంపల్లి ముత్యాలు ప్రమేయం లేనప్పటికీ టీడీపీ నేతలు పోలీ సులపై ఒత్తిళ్లు తెచ్చి అక్రమ కేసు బనాయించారు.

పోలీసుల అదుపులో నిందితులు

ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్‌చార్జ్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ నేతల ఒత్తిళ్లతో కేసు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నేత ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. నిజమైన నిందితులను మాత్రమే కేసులో పెట్టాల్సి ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి కుట్రలకు తెర లేపారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

స్టేషన్‌కు తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీసుస్టేషన్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దైవ ప్రసాద్‌ ఆదేశాలతో శెట్టూరులో నలుగురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు చేపట్టారు. అనంతరం అక్రమ కేసుపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఇన్‌చార్జ్‌ సీఐతో చర్చించారు. జరిగిన ఘటనకు పార్టీ నేతకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకుండానే కేసుకు సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం సరి కాదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అయ్యగార్లపల్లి మంజు, ఎంపీపీ మాజీ సభ్యుడు సోమనాథ్‌రెడ్డి, శివన్న యాదవ్‌, శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌, టైలర్‌ వన్నూరుస్వామి, నాగేంద్ర, రాజశేఖర్‌రెడ్డి, నాగేంద్రరెడ్డి, రాము, గౌరయ్య, బాబురావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement